పాన్ ఇండియా ట్రెండ్‌ కు బ్రేక్? మళ్లీ రీజినల్ సినిమాలదే హవానా?

పాన్ ఇండియా సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్లు ఎలిమెంట్స్ తప్పనిసరిగా వినిపిస్తున్నాయి.;

Update: 2026-01-25 03:58 GMT

పాన్ ఇండియా సినిమా అంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్లు ఎలిమెంట్స్ తప్పనిసరిగా వినిపిస్తున్నాయి. ఒకే సినిమాతో మార్కెట్ దక్కించుకోవాలన్న ఆశతో నిర్మాతలు కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. హీరోలకు భారీ పారితోషికాలు, పలు భాషల్లో డబ్బింగ్, దేశవ్యాప్తంగా ప్రమోషన్లు.. ఇలా పాన్ ఇండియా మూవీ చేయాలంటే ఖర్చు సాధారణ సినిమాల కంటే రెట్టింపు అవుతోంది.

సినిమా హిట్ అయితే లాభాలు కూడా అంతే భారీగా ఉంటాయి. కానీ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోతే నష్టాలు మాత్రం తట్టుకోలేనివిగా మారుతున్నాయి. పాన్ ఇండియా మూవీ అన్ని భాషల ప్రేక్షకులను చేరుకోవాలంటే కేవలం స్టార్ పవర్ సరిపోదు. కథ, భావోద్వేగాలు అందరికీ కనెక్ట్ కావాలి. అలాగే ప్రతి భాషలో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు దేశం మొత్తం తిరిగి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఈవెంట్లలో పాల్గొనాలి.

ఇది చాలా సమయం, శ్రమ అవసరమైన పని. ఈ మొత్తం ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా, సినిమా ఫలితం పూర్తిగా తారుమారు అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి 2026 సీజన్ ఆ విషయాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది. భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రభాస్ సినిమాలకు సాధారణంగా మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి.

కానీ ఈసారి రాజా సాబ్ కు అక్కడ ప్రారంభం నుంచే స్పందన వీక్ గా కనిపించింది. నెగెటివ్ టాక్ రావడంతో సినిమా పొజిషన్ మారిపోయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రీజినల్ సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మాత్రం అద్భుతంగా ఆడింది. కేవలం తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తీసిన ఆ చిత్రం, కలెక్షన్ల పరంగా రాజా సాబ్ ను కూడా భారీ తేడాతో దాటేయడం విశేషం.

ఇది మరోసారి కంటెంట్ ఉంటే రీజినల్ సినిమా అయినా పెద్ద విజయాన్ని అందుకోగలదని నిరూపించింది. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన ధురంధర్ మరో ఆసక్తికర ఉదాహరణ. సినిమా కేవలం హిందీలోనే విడుదలైంది. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయలేదు, పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. అయినా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. భాషతో సంబంధం లేకుండా కథ, బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చూపించింది.

దీంతో పాన్ ఇండియా పేరుతో అవసరానికి మించిన బడ్జెట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి సినిమా పాన్ ఇండియా అవ్వాల్సిన అవసరం లేదని, ముందు రీజినల్ ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. హీరోలు, నిర్మాతలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ కంటెంట్ ఆధారిత రీజినల్ సినిమాలదే హవా మొదలవుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News