టైటిల్స్ విష‌యంలో ఓటీటీల‌ వేషాలు!

లేక‌పోతే రిలీజ్ చేయ‌మంటున్నారు? అలాంట‌ప్పుడు వారు చెప్పిన‌ట్లు చేయ‌డం త‌ప్ప తామేం చేయ‌గ‌ల‌మ‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.;

Update: 2025-09-19 01:30 GMT

సినిమాని నియంత్రించే స్థాయికి ఓటీటీ ఎలా ఎదిగింద‌న్న‌ది తెలిసిందే. చిన్న‌గా మొద‌లైన ఓటీటీ నేడు మ‌హావృ క్షంలా ఎదిగింది. ఓటీటీ రిలీజ్ లేక‌పోతే సినిమాలు తీసే ప‌రిస్థితి లేకుండా పోయింది నేడు. చివ‌రికి నిర్మాత ఓటీటీ ముందు చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డాల్సిన స‌న్నివేశం ఎదురైంది. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్న‌ది ఓటీటీ స్లాట్ ఇచ్చిన త‌ర్వాత నిర్మాత రిలీజ్ డేట్ ఇవ్వాలి. అంత వ‌ర‌కూ డేట్ ఇచ్చే అధికారం నిర్మాత‌కు లేదు. కోట్ల రూపాయ‌లు వెచ్చించి నిర్మాత సినిమా చేసినా? ఓటీటీ బిజినెస్ కోసం కార్పోరేట్ సంస్థ‌ల ముందు చాకిలా ప‌డాల్సి వ‌స్తోంది.

మా చేతుల్లో ఏం లేదు:

మా సినిమాపై మీ పెత్త‌నం ఏంటి? అని అడ‌గాల‌ని ఉన్నా? అడ‌గ‌లేని ప‌రిస్థితులు దాప‌రించాయి. తాజాగా ఓటీటీలు ఏకంగా సినిమా టైటిల్స్ ను కూడా డిసైడ్ చేసే స్థాయికి ఎదిగాయ‌ని హీరో కం ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనీ మాట‌ల్లో స్ప‌ష్టంగా బ‌య‌ట ప‌డింది. ఇత‌ర భాష‌ల చిత్రాల‌ను కూడా టైటిల్స్ మార్చ‌కుండా అదే టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారేంటి? మాతృ భాష ప‌రంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అది సినిమాకు న‌ష్టం క‌లుగుతుంది క‌దా? అనే ప్ర‌శ్న ఆయ‌న ముందుంచితే నా చేతుల్లో ఏముంది. అంతా ఓటీటీ చేతుల్లోనే ఉంద‌ని తేల్చేసారు.

ఓటీటీలు బ‌రితెగింపు:

అన్ని భాష‌ల్లోనూ ఒకే టైటిల్ తో సినిమా రిలీజ్ చేయాల‌ని ఓటీటీలు కండీష‌న్ పెడుతున్నాయ‌న్నారు. లేక‌పోతే రిలీజ్ చేయ‌మంటున్నారు? అలాంట‌ప్పుడు వారు చెప్పిన‌ట్లు చేయ‌డం త‌ప్ప తామేం చేయ‌గ‌ల‌మ‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఒక భాష చిత్రాన్ని మ‌రో భాష‌లో రిలీజ్ చేసే ట‌ప్పుడు ఆయా మాతృభాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వా ల్సిన బాధ్య‌త మాపై ఉంది. కానీ అలా చేస్తే త‌మ వ్యాపారం దెబ్బ‌తింటుంద‌ని అన్ని భాష‌ల్లోనూ ఒకేలా రిలీజ్ చేస్తేనే త‌మ‌కు లాభం చేకూరుతుందని ఓటీటీలు భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యంలో విజ‌య్ ఆంటోనీలో కూడా తీవ్ర అస‌హనం క‌నిపించింది. దీంతో ఓటీటీలు ఎంత‌కు తెగించాయి? అన్న‌ది మ‌రోసారి సుస్ప‌ష్టమ‌వుతోంది.

భాషా సంఘాలు రంగంలోకి:

ఈ విష‌యంలో నిర్మాత‌లు ఓటీటీల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేరు. తీసుకుంటే త‌మ సినిమానే న‌ష్ట‌పోతుంది. కానీ ఓటీటీల‌ను నియంత్రించాల్సిన బాధ్య‌త ఎంతైనా ఆయా భాషా సంఘాల‌పై ఉంది. ఇప్ప‌టికే తెలుగు భాష ఉనికిని కోల్పోతుంద‌ని...తెలుగు వ‌చ్చినా మాట్లాడే వాళ్లు క‌నిపించ‌డం లేద‌ని భాషా పండింత‌లు ఆవేద‌న చెందుతోన్న వైనం క‌నిపిస్తూనే ఉంది. ఇలాగే కొన‌సాగితే తెలుగు భాష చ‌రిత్ర పుట్ట‌ల్లో లేకుండానే పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క‌మ‌వుతోంది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు కూడా క‌ల్పించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News