'A' సర్టిఫికేట్‌తో కిల్ చేయొద్దు..CBFC కి జర్నలిస్ట్ అభ్యర్థన
ఈ చిత్రం గురించి దొరై మాట్లాడుతూ.. ``ఇది కుటుంబ సమేతంగా చూడదగిన ఒక అద్భుతమైన రొమాంటిక్ డ్రామా.;
టాలెంటెడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్- మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `కపుల్ ఫ్రెండ్లీ`. అజయ్ కుమార్- రాజు పి నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా నేడు (ఫిబ్రవరి 14న) ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కేవలం టైటిల్ కారణంగానే సెన్సార్ బోర్డ్ అధికారులు `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారని దర్శకనిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసారు. `ఫ్రెండ్లీ కపుల్` అని టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించినా, ఇప్పటికే ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిన టైటిల్ ని మార్చేందుకు నిర్మాతలు ఆసక్తిని కనబరచలేదు. తాజాగా ప్రివ్యూ వీక్షించిన చెన్నైకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ఒట్రన్ దొరై ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సి) `A` సర్టిఫికేట్ కేటాయించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్ ప్రసూన్ జోషి సహా పలువురు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
కేవలం `కపుల్ ఫ్రెండ్లీ` అనే టైటిల్ ఆధారంగా ఈ చిత్రానికి `A` సర్టిఫికేట్ ఇచ్చారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేయడం తనను కలచివేసిందని దొరై పేర్కొన్నారు. ఈ రోజుల్లో హింస, అసభ్యత ఉన్న సినిమాలకు కూడా U/A ఇస్తుంటే, కేవలం ఒక టైటిల్‌ను బట్టి ఒక స్వచ్ఛమైన ప్రేమకథను 18 ఏళ్లు పైబడిన అడల్ట్‌కి మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు! అని ఆయన తన లేఖలో విశ్లేషించారు.
ఈ చిత్రం గురించి దొరై మాట్లాడుతూ.. ``ఇది కుటుంబ సమేతంగా చూడదగిన ఒక అద్భుతమైన రొమాంటిక్ డ్రామా. సంతోష్ శోభన్, మానస వారణాసి తమ నటనతో ఆకట్టుకున్నారు. సంగీతం, ఎడిటింగ్ , సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలాంటి ఆంక్షలతో సినిమాను `కిల్` చేయొద్దు`` అని కోరారు.
అంతేకాదు క్రిటిక్ దొరై అధికారులకు విన్నవిస్తూ లేఖలు రాసారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి సినిమాను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఎఫ్‌సీ ఛైర్మన్ ప్రసూన్ జోషి, కేంద్ర సమాచార , ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ సహా హైదరాబాద్, చెన్నై ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ కార్యాలయాలకు లేఖ రాసారు. ఈ సినిమాకు దాని కంటెంట్‌కు తగినట్లుగా U లేదా U/A సర్టిఫికేట్ ఇచ్చి చిత్ర పరిశ్రమలోని సృజనాత్మకతను కాపాడాలని దొరై తన లేఖలో విన్నవించారు.
గతానుభవాలు వేరు:
గతంలో సెన్సార్ బోర్డ్ డర్టీ పిక్చర్, ఉడ్తా పంజాబ్, అర్జున్ రెడ్డి సహా చాలా చిత్రాలకు `ఎ` సర్టిఫికెట్లను మంజూరు చేసింది. వాటితో పోలికే లేని `కపుల్ ఫ్రెండ్లీ` సినిమాకి కూడా `ఎ` సర్టిఫికెట్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. క్రూరత్వం, హింస, రక్తపాతం, స్త్రీ విద్వేషం ఇవేవీ లేకుండానే ఈ సినిమాకి `ఎ` సర్టిఫికెట్ ఇవ్వడమేమిటి? అని కొన్ని సందేహాలు ఇండస్ట్రీలో రేకెత్తాయి. కేవలం టైటిల్ కారణంగానే ఇలా చేసారా?