చీరల్లో ఆడవాళ్ల ముస్తాబు.. పోసాని మాట్లాడితే అరెస్ట్ చేస్తారా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రైటర్ గా నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో నిలిచారు.

Update: 2026-07-15 06:35 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రైటర్ గా నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన సినిమా కంటే, మూవీ ప్రమోషన్స్ లో చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కిన ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో పోసాని చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

కార్యక్రమంలో హోస్ట్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో అమ్మాయిలే చీర కట్టుకుని రెడీ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు మాత్రం చీర కట్టుకుని డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, నటిస్తున్నారు. ఎలా సాధ్యమైంది సర్?" అని ప్రశ్నించారు. దీనికి పోసాని తనదైన శైలిలో స్పందించారు. "నేను ఆడవాళ్ల చీర గురించి, నా చీర గురించి మాట్లాడాననుకో.. మళ్లీ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడే బయటకొచ్చా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

పోసాని చేసిన ఆ కామెంట్‌ కు అంతా నవ్వేశారు. కానీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది పూర్తిగా ఫన్నీ కామెంట్ మాత్రమేనని చెబుతుంటే, మరికొందరు పోసాని గతంలో ఎదుర్కొన్న రాజకీయ, న్యాయ పరమైన వివాదాలు పరోక్షంగా ప్రస్తావించారని అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా రాజకీయ వ్యాఖ్యలు, విమర్శల కారణంగా పోసాని తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన మళ్లీ అరెస్ట్ చేస్తారనే కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ వ్యాఖ్యలను ఆయన ఎవరినీ పరోక్షంగా టార్గెట్ చేసుకుని చేశారా? లేక కేవలం ఫన్ కోసం అన్నారా? అనే చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, పోసాని కృష్ణమురళి సినీ జర్నీ విభిన్నంగా సాగింది. పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత సోల్ రైటర్ గా ఎదిగి వందలాది చిత్రాలకు కథలు, మాటలు అందించారు.

పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన రచన అందించారు. దర్శకుడిగా శ్రావణమాసం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలతో తనదైన ముద్ర వేశారు. నటుడిగా కూడా విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కింది.

అవినీతి, రాజకీయ అక్రమాలను వెలికి తీసే ఓ ధైర్యవంతురాలైన జర్నలిస్ట్ కథ చుట్టూ సినిమా సాగనుందని మూవీ టీమ్ చెబుతోంది. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బీజేపీ నేత రఘునందన్ రావు కూడా ఇందులో కనిపించనున్నారు. జూలై 17న విడుదల కానున్న ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా పోసాని చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. చీర కట్టిన పాత్ర గురించి మొదలైన చర్చ.. పోసాని మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అనే ప్రశ్న వరకు వెళ్లడం వైరల్ గా మారింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన ఆ వైరల్ మూమెంట్ మూవీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.




Tags:    

Similar News