రా ఎన్టీఆర్ Vs ఎన్టీఆర్ టీమ్.. అసలేం జరుగుతోంది?

ఇటీవల జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Update: 2026-07-15 04:58 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చుట్టూ గత కొన్ని రోజులుగా పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ అభిమానుల కోసం, సేవా కార్యక్రమాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ ఒకవైపు ఉంటే, ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించడం మరోవైపు చర్చకు దారి తీసింది. దీంతో అసలు ఎవరిది నిజం? రా ఎన్టీఆర్ సంస్థ ప్లేస్ ఏమిటి? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఇటీవల జూలై 18న ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో రా ఎన్టీఆర్ సంస్థ పేరు కూడా వినిపించింది. దీంతో ఆ వ్యవహారంపై స్పందించిన ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఎన్టీఆర్ తో, ఆయన కార్యాలయంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఆ సంస్థకు లేదని కూడా పేర్కొంది.

అంతేకాదు, ఎన్టీఆర్‌ కు సంబంధించిన ఏ సమాచారం అయినా అఫీషియల్ టీమ్ ద్వారా వెలువడుతుందని తెలిపింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లేదా ఇతర సంస్థల ద్వారా వచ్చే ప్రచారాన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా పరిగణించవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే ఆ ప్రకటనతో వివాదం ముగియలేదు. రా ఎన్టీఆర్ సంస్థ ఫౌండర్ సాయి రూప్ దీనిపై స్పందించారు. తమ సంస్థ ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వేలాది మంది వాలంటీర్లు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు.

తమ ఉద్దేశం కేవలం సేవ మాత్రమేనని, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి రూప్, ఎన్టీఆర్ కార్యాలయం పేరుతో విడుదలైన లేఖపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆ లెటర్ గురించి ఎన్టీఆర్‌ కే తెలిసి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆపమంటే వెంటనే అన్ని కార్యక్రమాలు నిలిపివేస్తామని చెప్పారు. తమకు ఎన్టీఆర్ అంటే దేవుడితో సమానమని, ఆయన పేరు ద్వారా సేవా కార్యక్రమాలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

అదే సమయంలో అభిమాన సంఘాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు అభిమానులు? ఎవరు ఎన్టీఆర్‌ కు దగ్గరగా ఉన్నవారు? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కొందరు ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన ఫైనల్ గా భావిస్తుండగా, మరికొందరు రా ఎన్టీఆర్ గత సేవా కార్యక్రమాలు ప్రస్తావిస్తున్నారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించినా, ఇప్పుడు టీమ్ అలా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ వస్తున్న ఊహాగానాలు నేపథ్యంలో ఆ వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనా రా ఎన్టీఆర్ సంస్థ, ఎన్టీఆర్ టీమ్ మధ్య మాటల యుద్ధంగా మొదలైన ఆ వివాదం ఇప్పుడు అభిమాన వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఎన్టీఆర్‌ పైనే ఉంది. ఆయన నేరుగా స్పందిస్తారా? లేక అధికారిక ప్రకటన తో ముగింపు పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News