క్యూ క‌ట్టిన బ‌యోపిక్స్ ..ఒక్కోక్క‌టిగా బ‌రిలోకి!

ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. అలాగే భారతీయ సినీ పితామహులలో ఒకరైన వి. శాంతారామ్ జీవిత గాథను సిద్దాంత్ చతుర్వేది వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.

Update: 2026-07-15 00:30 GMT

బాలీవుడ్ వాస్తవిక కథలకు... ముఖ్యంగా వ్యక్తుల జీవిత చరిత్రలకు పెద్దపీట వేస్తోంది. ప్రముఖ వ్యక్తుల పోరాటాలు, విజయాలు , సామాజిక మార్పుకు వారు చేసిన కృషిని వెండితెరపై చూపించడానికి చిత్ర పరిశ్రమ ఎప్ప‌టిక‌ప్పుడు ఆసక్తి చూపుతోంది. ఈ నేప‌థ్యంలో పలువురు అగ్రనటులు చారిత్రాత్మక పాత్రల్లో అలరించడానికి సిద్ధ మవుతున్నారు. ప్రముఖ మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి భావు మంగ్ నారాయణగాంకర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. 'తమాషా క్వీన్' గా పేరుగాంచిన విఠాబాయి ఎన్నో కష్టా లను అధిగమించి కళను ఎలా నిలబెట్టారో? ఈ సినిమా చూపిస్తుంది.

ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. అలాగే భారతీయ సినీ పితామహులలో ఒకరైన వి. శాంతారామ్ జీవిత గాథను సిద్దాంత్ చతుర్వేది వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. మూకీ సినిమాల కాలం నుండి రంగుల ప్రపంచం వరకు ఆయన ప్రస్థానాన్ని ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపించనుంది. ఈ సినిమాలో తమన్నా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథలో ధ‌నుష్ న‌టిస్తున్నారు . 'వింగ్స్ ఆఫ్ ఫైర్' పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కలాం సాధారణ జీవితం నుండి అసాధారణ విజయాల వైపు ఎలా సాగిందో చూపిస్తుంది.

ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధ‌వ‌న్ భారత్ 'ఎడిసన్ గా పిలువబడే గోపాలస్వామి దొరైస్వామి నాయుడు పాత్రలో కనిపించబోతున్నారు. విజ్ఞాన శాస్త్రం .. పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను ఈ చిత్రం ప్రతిబింబించనుంది. కృష్ణ‌కుమార్ రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం ఇదనెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే అన్నిప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే ముంబై మాజీ పోలీసు కమిషనర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా జాన్ అబ్రహం కథానాయకుడిగా ఓ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమాల‌న్నీ 2026-2027లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చే చిత్రాలు.

అయితే ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో ఉన్న అతిపెద్ద సవాలు వాస్తవికత. వ్యక్తుల జీవితాలను వక్రీకరించకుండా వారి పోరాటాలను, గెలుపోటములను అత్యంత పారదర్శకంగా వెండితెరపై ఆవిష్కరించడం దర్శకులకు పరీక్ష లాంటిదే. ఈ చిత్రాలు భారతీయ చలనచిత్ర స్థాయిని ఏ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్తాయో చూడాలి. ఈ బయోపిక్ పర్వంతో స్టార్ హీరోలు కూడా గ్లామర్ పాత్రల కంటే లోతైన నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలకు మొగ్గు చూపడం దేశవ్యాప్త ప్రేక్షకుల అభిరుచిలో వ‌స్తోన్న గొప్ప మార్పును సూచిస్తోంది.

Tags:    

Similar News