చెట్టు వెన‌క డ్రెస్ మార్చుకోమ‌న్నాడు..న‌టి శోభ‌న‌

కానీ సెట్లో ఒక‌డు ఒక చెట్టు చాటుకు వెళ్లి దుస్తులు మార్చుకోవాల్సిందిగా కోరాడు. మ‌ల‌యాళీలు అడ్జ‌స్ట్ కాగ‌ల‌రు. చెట్టు వెన‌క మార్చుకుంటుంది! అని అన్నాడు.;

Update: 2025-06-08 05:54 GMT

సెట్లో మ‌హిళ‌ల‌కు అమ‌ర్యాద క‌లిగించే ప్ర‌వ‌ర్త‌న‌పై ఇటీవ‌ల‌ చాలా చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో హేమ క‌మిటీ నివేదిక సంచ‌ల‌నాలు సృష్టించిన‌ త‌ర్వాత కూడా ఆన్ లొకేష‌న్ అమ‌ర్యాద ఫ‌ర్వం కొన‌సాగుతోంది. మ‌హిళ‌ల్ని త‌క్కువ చేసి చూడ‌టం, అస‌భ్యంగా చూడ‌టం, లేదా పిల‌వ‌డం, ప‌రాయి భాషా న‌టీమ‌ణుల‌ను గౌర‌వించ‌క‌పోవ‌డం వంటి చ‌ర్య‌లు నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉన్నాయి. కొంద‌రు మ‌హిళా న‌టీమ‌ణులు ఇప్ప‌టికీ లైంగిక వేధింపుల‌పై బ‌హిరంగంగా ఆరోపిస్తున్నారు.

అయితే కొన్నేళ్ల క్రితం ఆన్ లొకేష‌న్ త‌న‌కు ఎదురైన ఒక అనుభ‌వాన్ని సీనియ‌ర్ న‌టి, మేటి క్లాసిక్ డ్యాన్స‌ర్ శోభ‌న గుర్తు చేసుకున్నారు. ఆరోజు ఒక పాట చిత్రీక‌ర‌ణ సాగుతోంది. తాను చాలా దుస్తులు మార్చాల్సి వ‌చ్చింది. కానీ త‌న‌కు కార‌వ్యాన్ లేదు. అస‌లే న‌గ‌రానికి ద‌గ్గ‌ర‌గా షూటింగ్ జ‌రుగుతున్నందున ప్ర‌జ‌లంతా షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చారు. అలాంటి చోట తాను దుస్తులు మార్చుకోవ‌డానికి స‌రైన వ‌స‌తి లేదు. మేక‌ర్స్ ని కార‌వ్యాన్ సౌక‌ర్యం ఉందా? అని కూడా అడిగిన‌ట్టు శోభ‌న గుర్తు చేసుకున్నారు.

కానీ సెట్లో ఒక‌డు ఒక చెట్టు చాటుకు వెళ్లి దుస్తులు మార్చుకోవాల్సిందిగా కోరాడు. మ‌ల‌యాళీలు అడ్జ‌స్ట్ కాగ‌ల‌రు. చెట్టు వెన‌క మార్చుకుంటుంది! అని అన్నాడు. అయితే ఆ మాట‌ను వాకీ టాకీలో విన్న వెంట‌నే కార‌వ్యాన్ లో ఉన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ నేరుగా త‌న వ‌ద్ద‌కు ఎవ‌రు ఆ మాట అన్న‌ది అని అడిగారు. అంతేకాదు.. వెంట‌నే త‌న కార‌వ్యాన్ ఉప‌యోగించుకుని దుస్తులు మార్చుకోవాల్సిందిగా అమితాబ్ చెప్పారు. అంతేకాదు.. శోభ‌నకు త‌న కార‌వ్యాన్ ఇచ్చి, ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లారు. మెగాస్టార్ విన‌యం, ఒదిగి ఉండే స్వ‌భావం ఇప్ప‌టికీ అలానే ఉన్నాయని శోభ‌న గుర్తు చేసుకున్నారు.

నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన 'కల్కి 2898 ఏడి'లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించగా, శోభన మరియం అనే పాత్ర పోషించింది. ఈ చిత్రం పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. మోస్ట్ అవైటెడ్ క‌ల్కి 2898 ఏడి సీక్వెల్ గురించి అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. శోభన చివరిగా 'తుడారుమ్'లో మోహన్‌లాల్‌తో కలిసి కనిపించింది. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది.

Tags:    

Similar News