ఓజీ మేకర్స్.. ఈ అతి అవసరమా?
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది పుష్ప-2 విడుదలకు ముందు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల విషయంలో ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ఆ సినిమా రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల ఈ విషయంలో అనుమతులు ఆగిపోయాయి. కానీ ఈ మధ్య మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు రేట్లు పెంచుకునే, బెనిఫిట్ షోలు వేసుకునే సౌలభ్యం కల్పించారు. దీని మీద వివాదం నెలకొంది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ మల్లేష్ యాదవ్ అనే లాయర్.. కోర్టును ఆశ్రయించారు. ముందు రేట్ల పెంపు చెల్లదంటూ సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దాని మీద ఓజీ మేకర్స్ అప్పీల్ చేస్తే.. రేట్ల పెంపుపై విధించిన స్టేను తొలగించారు. యథాప్రకారం రేట్ల పెంపుతోనే టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి.
ఐతే ఇందుకు ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంతోషించి తమ పని తాము చేసుకుంటే బాగుండేది. కానీ టికెట్ల ధరల పెంపుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన లాయర్ మల్లేష్ యాదవ్ మీద కౌంటర్ వేస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. రేట్ల పెంపు మీద హైకోర్టు సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తి వేయడంపై హర్షం ప్రకటిస్తూ.. మల్లేష్ యాదవ్‌కు రూ.100 డిస్కౌంటుతో టికెట్ ఇస్తామని.. ఓజీ సినిమాను ఎంజాయ్ చేయాలని ఈ పోస్టులో పేర్కొన్నారు. ఇది అడ్మినే చేసి ఉండొచ్చు కానీ.. దీని వల్ల పర్యవసానాలు ఎదుర్కోవాల్సింది నిర్మాణ సంస్థ. కోర్టు వ్యవహారాలతో ముడిపడ్డ విషయం మీద ఇంత వెటకారం అవసరమా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికి ఓజీకి ఇబ్బంది లేకపోవచ్చు కానీ రాబోయే సినిమాల మీద దీని ప్రభావం పడొచ్చు. టికెట్ల ధరల పెంపు ప్రేక్షకులు కోరుకున్నది కాదు కాబట్టి.. ఇలా కౌంటర్లు వేస్తే డీవీవీ సంస్థ మీద సామాన్య జనాల్లోనూ వ్యతిరేకత తప్పదు ఈ నేపథ్యంలోనే. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.