'ఓజీ'లో సుభాష్ చంద్రబోస్‌ ఏంటీ..!!

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ను చాలా విభిన్నంగా చూడబోతున్నాం;

Update: 2025-09-23 05:18 GMT

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ను చాలా విభిన్నంగా చూడబోతున్నాం. మరికొన్ని గంటల్లో ఓజీ ఆట షురూ కానుంది. ఇప్పటికే సినిమా రికార్డ్‌ స్థాయి అడ్వాన్స్‌ బుకింగ్‌ నమోదు చేసింది. బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఖచ్చితంగా రూ.50 కోట్లను మించి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్ కెరీర్‌లో చాలా కాలం తర్వాత ఈ స్థాయి హైప్‌ రావడం ఇదే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ పవన్ మాట్లాడుతూ ఖుషి తర్వాత మళ్లీ ఫ్యాన్స్‌లో ఈ స్థాయి ఉత్సాహం చూస్తున్నాను అన్నాడు. అందుకు కారణం సుజీత్‌ దర్శకత్వం ఒకటి అయితే, సినిమాకు చేసిన ప్రమోషన్‌ ఒకటి అనడంలో సందేహం లేదు. అందుకే ఓజీ కోసం ఇప్పుడు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఓజీ మొబైల్‌ గేమ్‌లో సుభాష్ చంద్రబోస్‌

ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మేకర్స్ ఒక మొబైల్ వీడియో గేమ్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఆ వీడియో గేమ్‌ లో మూడు లెవల్స్ ఉన్నాయి. వీడియో గేమ్‌ లో ఒక కథను నడిపిస్తూ లెవల్స్ సాగుతూ ఉంటాయి. అయితే ఆ కథ సినిమాలో ఉన్న కథ కాకుండా, సినిమాలోని కథకు ప్రీక్వెల్‌గా ఉంటుంది. ఆ కథలో ముందుకు వెళ్తున్నా కొద్ది ఒక లెవల్‌ లో సుభాష్ చంద్రబోస్ సైతం వస్తాడు. గేమ్‌ ఆడిన వారు, ఆ లెవల్‌ వరకు వెళ్లిన వారు సుభాష్‌ చంద్రబోస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. గేమ్‌ను విభిన్నంగా డిజైన్‌ చేయడంతో పాటు, కథ మాదిరిగా ముందుకు తీసుకు వెళ్లడం ద్వారా ఓజీ సినిమాకు మరింత బలం చేకూరినట్లు అవుతుందని, ఇదో మంచి పబ్లిసిటీ స్టంట్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఓజీ సినిమాలో సుభాష్‌ చంద్రబోస్‌ ఉండడు కానీ, ఓజీ మొబైల్‌ గేమ్‌లో మాత్రం బోస్ కనిపిస్తున్నారు.

ఓజీ కత్తిలో కనిపించేది అకీరా నందన్‌

ఇక ఈ సినిమాలో అకీరా ఉంటాడు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. సుజీత్‌ ను అడిగితే ఆయన పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని సున్నితంగా దాటవేస్తూ వచ్చారు. కొందరు అసలు నిజం కాదు అన్నట్లుగా మాట్లాడారు. కానీ తాజాగా విడుదల అయిన ట్రైలర్‌ను చూస్తే మాత్రం అకీరా ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఒక కత్తిలో ఫేస్ను లైట్‌గా రివీల్‌ చేయడం జరిగింది. కత్తిలో కనిపిస్తున్న కళ్లు చూస్తూ ఉంటే అవి అకీరా కళ్లు అయ్యి ఉంటాయి అని చాలా మంది స్క్రీన్‌ షాట్స్ తీసి మరీ చర్చించుకుంటున్నారు. అకీరా కళ్లు, ఆ కళ్లు పక్కన పెట్టి పోల్చుతున్నారు. ఖచ్చితంగా అకీరా ఉంటాడు, అతి ఎలా ఉంటాడు, ఏ సమయంలో ఉంటాడు అనేది చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అకీరా సినిమా ఎంట్రీకి రెడీ అవుతున్నాడు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అది ఓజీతో అయితే బాగుంటుంది, ముందు ముందు అకీరా హీరోగా సినిమాలు రావడం ఖాయం అని ఓజీ విడుదల తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాహుల్‌ రవీంద్రన్‌ కనిపించడు

ఓజీ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. సినిమాలో రాహుల్‌ రవీంద్రన్‌ నటించాడు, కానీ ఆయన సినిమాలో కనిపించబోవడం లేదని అంటున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ కోసం దర్శకుడు సుజీత్ ఒక మంచి పాత్రను అనుకున్నాడు. షూటింగ్‌ కూడా జరిగిందట. దాదాపు పది నుంచి పదిహేను రోజుల పాటు రాహుల్‌ రవీంద్రన్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడని కూడా సమాచారం ఉంది. ట్రైలర్‌లోనూ ఒక షాట్‌లో రాహుల్‌ రవీంద్రన్‌ కనిపిస్తాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాహుల్‌ రవీంద్రన్ మాట్లాడుతూ ఓజీ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న మాట వాస్తవం. కానీ ఫైనల్‌ ఎడిట్‌లో నా పాత్రను తొలగించాల్సి వచ్చిందని అన్నారు. నా పాత్రను తొలగించడం అనేది దర్శకుడి నిర్ణయం కాబట్టి నేను అడ్డు చెప్పలేక పోయాను. ఫైనల్‌ గా సినిమా బాగా రావాలని దర్శకులు కోరుకుంటారు. కనుక వారి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం అన్నాడు. ఓజీ వంటి సినిమాలో ఛాన్స్ రావడం గొప్ప విషయం, కానీ చివరికి అందులో నా పాత్రను తొలగించడం ఖచ్చితంగా బాధ కలిగించే విషయం అని రాహుల్‌ అన్నారు.

Tags:    

Similar News