'ఓజీ' సూపర్ హిట్ టాక్ .. కంటెంట్ ను మించిన కటౌట్ గా పవన్!
పవన్ కల్యాణ్ తో సినిమా ఛాన్స్ రాగానే చాలా మంది దర్శకులు కథను సిద్ధం చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.;
కొన్ని కథలు కొంతమంది హీరోలకు సెట్ అవుతాయి .. కొన్ని పాత్రలు కొంతమంది హీరోలకు నప్పుతాయి. అలా అనుకోకుండా అన్నీ కుదరడమే అప్పుడప్పుడూ జరిగే ఒక మేజిక్. అలాంటి మేజిక్ ఇప్పుడు 'ఓజీ' విషయంలో జరిగిందనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, తొలి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది.
ఈ సినిమా చూసిన పవన్ అభిమానులనంతా తమకి దసరా పండుగ ముందుగానే వచ్చేసిందని సందడి చేస్తున్నారు. అందుకు కారణం ఈ సినిమాలో పవన్ కనిపించిన తీరు .. ఆ పాత్రలో ఆయన ఆవిష్కరించిన స్టైల్ .. పెర్ఫెక్ట్ గా కంపోజ్ చేసిన ఫైట్స్ .. భార్యాబిడ్డల పట్ల అతనికి గల ఎమోషన్ ను అడ్డుపెట్టుకుని వర్కౌట్ చేసిన కంటెంట్ అనే చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేయడం .. ఆ ప్రేమను దక్కకుండా చేసినవారిపై తిరిగి యుద్ధాన్ని ప్రకటించడమే ఈ సినిమా కథ.
పవన్ కల్యాణ్ తో సినిమా ఛాన్స్ రాగానే చాలా మంది దర్శకులు కథను సిద్ధం చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే సుజీత్ మాత్రం అలాంటి కసరత్తులు చేస్తూ కాలం వేస్ట్ చేయలేదు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన అభిమానులకు ఇష్టమైన అంశాల చుట్టూనే ఈ కథను అల్లుకున్నాడు. కత్తులు .. తుపాకులు .. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నాడు. పవన్ ను ఎలాగైతే చూడాలని కొన్నేళ్లుగా ఆయన ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారో, అలాగే ఆయనను కంటెంట్ ను మించిన కటౌట్ గా చూపిస్తూ వెళ్లాడు. ఇక్కడే సుజీత్ సక్సెస్ అయ్యాడు .. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ ను తెచ్చిపెట్టాడు.