ఓజీ ట్రైలర్ మళ్లీ మిస్సింగ్.. నిరాశలో ఫ్యాన్స్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` ఈనెల 25న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.;
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` ఈనెల 25న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం సాయంత్రం గచ్చిబౌళిలో జరిగిన ఓజీ కాన్సెర్ట్ వేడుకకు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భారీ వేదికపై జరగాల్సిన ఈ వేడుకకు వర్షం ఇబ్బందికరంగా మారింది. అయి0నా ఓజీ ఫ్యాన్స్ ఎక్కడా తగ్గలేదు. వర్షానికి భయపడి చలించలేదు. వర్షంలోనే వేడుకను వీక్షించి ఆశ్చర్యపరిచారు.
ఇదిలా ఉంటే, ఈ వర్షంలో గొడుగులతో ఓజీ బృందం వేదికపై ప్రత్యక్షమై పెద్ద షాకిచ్చింది. ఇక సుజీత్ చేసిన పనికి ఇలా వచ్చేశాను.. ఎప్పుడూ ఇలాంటి షూటింగ్ డ్రెస్ లో ఆడియో ఈవెంట్లకు రాలేదు! అంటూనే పవన్ కల్యాణ్ తన స్పీచ్ ని అదరగొట్టేసారు. వేదికపై బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో అతడు రియల్ గ్యాంగ్ స్టర్ ని తలపించాడు. అతడితో పాటు వేదికపై ఇమ్రాన్ హష్మి కూడా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో కనిపించాడు.
సంజయ్ సాహోకి ఏదీ తేలిగ్గా రాదు. . పవన్ కల్యాణ్ కి ఏది ఉట్టినే రాదు.. ఎన్నో ఇబ్బందులు.. సెన్సార్ సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఈనెల 25న వస్తున్నాం.. అని పవన్ ఈ వేదికపై అధికారికంగా మరోసారి ఓజీ రిలీజ్ తేదీని కన్ఫామ్ చేసారు. అయితే ట్రైలర్ రాక అంతకంతకు ఆలస్యమవ్వడంతో అభిమానుల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో పవన్ సుజీత్ ని ట్రైలర్ ఎక్కడ? అంటూ పదే పదే ప్రశ్నించారు.
ట్రైలర్ ఇంకా రెడీ కాలేదు.. డీఐ పూర్తవ్వలేదు అన్నారు.. డీఐ సంగతి మావాళ్లు చూస్తారు. ముందు ట్రైలర్ వేయ్ అని సుజీత్ ని పవన్ డిమాండ్ చేసారు. కానీ ట్రైలర్ వేయకపోవడంతో పవన్ సహా అభిమానులు కూడా నిరాశ చెందారు. నిజానికి ఈ ఆదివారం ఉదయం 10.15 గం.లకు ఓజీ ట్రైలర్ విడుదలవుతుందని చిత్రబృందం వెల్లడించినా కానీ అది సాధ్యపడలేదు. కనీసం సాయంత్రం ప్రీరిలీజ్ వేడుకలో అయినా ట్రైలర్ వస్తుందని అభిమానులు ఆశించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఓజీ ఫ్యాన్స్ భారీగా ఈ వేడుకకు తరలి వచ్చారు. కానీ వారికి ట్రైలర్ ట్రీట్ ఇవ్వడంలో ఓజీ టీమ్ విఫలమైంది. అయితే డీఐ పూర్తి కాగానే దీనిని నేరుగా సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక ఓజీ ఈవెంట్లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అందకుండా ఎగురుతున్నావు... నేలకు ఎలా దించాలో నాకు తెలుసు.. నా గురువు ఒక హైకూ చెప్పాడు.. అది విను.. అంటూ విదేశీ భాషలో రాసిన సుదీర్ఘ డైలాగ్ వినిపించి పవన్ వేదిక ఆద్యంతం మరిగించారు. మొత్తానికి వర్షార్పణం అవుతుందనుకున్న ఈవెంట్ కి పవన్ తన స్పీచ్ తో ఎనర్జీని నింపడం ఇప్పుడు చర్చగా మారింది.