కత్తితో ఫ్యాన్స్ చేసిన పనికి హఠాత్తుగా ఆగిన OG షో
బెంగళూరులోని KR పురం థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ షోలు, భారీగా జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా విడుదల పండుగ వాతావరణంగా మారింది. అయితే ఈ వేడుకల మధ్య బెంగళూరులో మాత్రం ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది.
బెంగళూరులోని KR పురం థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సాహం, ఆతృతలో కొందరు ఫ్యాన్స్ నియంత్రణ కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తించారు. కొంత మంది అభిమానులు కత్తులు తీసుకువచ్చి, స్క్రీన్‌ను చింపేయడంతో వాతావరణం ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం వెంటనే షోను నిలిపివేసింది.
సినిమా ఆగిపోవడంతో ప్రేక్షకుల్లో నిరాశ నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని, అభిమానులను థియేటర్ వెలుపలికి పంపించారు. కొంత సేపటి తరువాత యాజమాన్యం, అభిమానులతో చర్చించి పరిస్థితిని కంట్రోల్ చేసింది. తరువాత మళ్లీ స్క్రీనింగ్ ప్రారంభించడంతో అందరికీ ఊరట లభించింది. అయితే ఈ సంఘటన అభిమానుల ఉత్సాహం ఎలా అతి హద్దులకు వెళ్లిపోతుందో చూపించింది.
ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. థియేటర్‌లోని స్క్రీన్ దెబ్బతిన్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్లిప్స్ చూసి చాలా మంది అభిమానుల హడావుడి తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా థియేటర్స్‌లో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి అంతరాయం ఉన్నప్పటికీ, సినిమా మిగతా స్క్రీనింగ్ సజావుగా పూర్తయింది. మరోవైపు, ఇతర ప్రాంతాల్లో ఓజీ ప్రీమియర్స్ ఘనవిజయంగా కొనసాగుతున్నాయి. అమెరికా, కెనడా సహా అనేక దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. భారీగా జరుగుతున్న కలెక్షన్లు ఈ సినిమా రికార్డులు తిరగరాయబోతున్నాయనే సంకేతాలిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల ఓపెనింగ్ పై రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా మొదటి రోజు సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.