ఓదెల 2.. బ్లాక్ బస్టర్ వైబ్స్!
ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ అని ట్రైలర్ లోనే స్పష్టమైంది. భయాన్ని కలిగించే దృశ్యాలతో పాటు, భక్తి భావాన్ని కలిగించే సన్నివేశాలు కూడిన ఈ చిత్రం ఎంతో ఉత్కంఠ రేపుతోంది.;
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంపత్ నంది నిర్మించారు. నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు కొనసాగింపుగా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో తమన్నా అఘోరా పాత్రలో ఓ గ్రామాన్ని హింసిస్తున్న దెయ్యానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనున్నారు.
ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ అని ట్రైలర్ లోనే స్పష్టమైంది. భయాన్ని కలిగించే దృశ్యాలతో పాటు, భక్తి భావాన్ని కలిగించే సన్నివేశాలు కూడిన ఈ చిత్రం ఎంతో ఉత్కంఠ రేపుతోంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. ఇక లేటెస్ట్ అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 29 నిమిషాలని తెలుస్తోంది.
ఇలాంటి సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెప్పవచ్చు. భగవంతుడికి, దెయ్యానికి మధ్య జరిగే ధార్మిక సంగ్రామాన్ని ఈ కాలవ్యవధిలో పూర్తి స్థాయిలో చూపించబోతున్నారు. సాధారణంగా ఇలాంటి చిత్రాలు తక్కువ నిడివితో ఉండగా, ఈ చిత్రం మాత్రం విభిన్నంగా సాగనుంది. దర్శకుడు అశోక్ తేజ ఈ కథను చక్కగా మలిచారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
ట్రైలర్ లో వినిపించిన నేపథ్య సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా శివతత్వంతో కూడిన గాఢ భావాలను కలిగించే డైలాగులకు తోడుగా వినిపించే సంగీతం, చిత్రానికి ఒక ప్రత్యేకతను కల్పించింది. కాస్ట్యూమ్స్, కళా నిర్మాణం, కేమేరా పనితనం అన్ని కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక సెన్సార్ నుంచి అప్పుడే బ్లాక్ బస్టర్ అనేలా టాక్ వస్తోంది.
ఈ సినిమాను చూసిన ప్రముఖులు సైతం పాజిటివ్ గా స్పందించారని తెలుస్తోంది. ముఖ్యంగా తమన్నా నటనకు విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఆమె పాత్రకు పూర్తి స్థయిలో న్యాయం చేశారు అని పలువురు అంటున్నారు. చిత్రంలో దృశ్యాలు, భావోద్వేగాలు ప్రేక్షకుల మనసును తాకేలా ఉన్నాయని ముందస్తు టాక్ స్పష్టం చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, ఓదెల 2 ఒక హారర్ థ్రిల్లింగ్ ఫీల్ ను కలిగిస్తూనే, భక్తిని ఒకే చోట హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతోంది. తమన్నా కెరీర్ లో ఇది మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.