ఔత్సాహిక ఫిలింమేకర్స్‌ కేస్ స్టడీ: 10కోట్ల బడ్జెట్‌తో 1000కోట్లు కొల్లగొట్టడమెలా?

చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్.. పెద్ద బాక్సాఫీస్ ఫలితం సాధించే సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

Update: 2026-05-23 14:30 GMT

చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్.. పెద్ద బాక్సాఫీస్ ఫలితం సాధించే సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హద్దుమీరిన బడ్జెట్లతో సాహసాలు చేస్తూ నష్టపోయే చాలా మంది కంటే.. క్రియేటర్లు తమ మేకింగ్ టెక్నిక్, వినూత్నమైన కంటెంట్‌తో వందల కోట్లు కొల్లగొట్టడాన్ని పరిశ్రమలో నిజమైన టాలెంట్‌గా పరిగణిస్తారు. ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి.. పరిమిత బడ్జెట్లలోనే వెండితెరపై మెరుపులు మెరిపించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అసాధారణ బడ్జెట్లతో వందల కోట్ల భారీ సినిమాలు తీయడం చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేము. అయితే భారీ ఖర్చు లేకుండా కేవలం స్క్రిప్ట్ బలం, టెక్నిక్‌తోనే ప్రపంచాన్ని షేక్ చేయవచ్చని హాలీవుడ్ చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మ‌రో చిన్న బ‌డ్జెట్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తుంటే దాని గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

బడ్జెట్ పరిమితులతో పని లేకుండా కేవలం మేకింగ్ టెక్నిక్‌తో బాక్సాఫీస్ వండర్స్ క్రియేట్ చేసిన హారర్ ఫ్రాంచైజీ అనగానే ప్రపంచ సినీ ఔత్సాహికులు, విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు చర్చించుకునే మొదటి పేరు `పారానార్మల్ యాక్టివిటీ`. 2007లో కేవలం 15,000 డాలర్ల (భారతీయ కరెన్సీలో కేవ‌లం కొన్ని లక్షల రూపాయలు అప్ప‌టి డాల‌ర్‌లో) అత్యల్ప బడ్జెట్‌తో... ఒక హోమ్ కెమెరా ఫుటేజ్ తరహా టెక్నిక్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 193 మిలియన్ డాలర్ల (సుమారు 1600 కోట్లకు పైగా) అసాధారణ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన దీని సీక్వెల్స్ కూడా కేవలం 3 నుండి 5 మిలియన్ డాలర్ల బడ్జెట్లతోనే రూపొంది వందల కోట్ల లాభాలను తెచ్చిపెట్టాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు హాలీవుడ్‌లో సరిగ్గా అలాంటి సంచలనమే పునరావృతమైంది.

ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్న సరికొత్త హారర్ చిత్రం `అబ్సెషన్`. ఈ సినిమా కేవలం 1 మిలియన్ డాలర్ల బడ్జెట్.. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 10 కోట్ల రూపాయల చిన్న వ్యయంతో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1000 కోట్లు) వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఇంత తక్కువ పెట్టుబడితో ఇంతటి భారీ వసూళ్లు సాధించిన వేరొక చిత్రం గ్లోబల్ సినిమాలో లేనే లేదు. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 18 మిలియన్ డాలర్లు సాధించడమే కాకుండా.. ఇటీవల వరుసగా మూడు రోజుల పాటు ప్రతిరోజూ 3.5 మిలియన్ డాలర్ల స్థిరమైన వసూళ్లతో అమెరికా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది.

ఈ చిన్న చిత్రం సాధిస్తున్న వసూళ్ల ప్రభంజనం ఎంతలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పాప్ చక్రవర్తి మైఖేల్ జాక్సన్ బయోపిక్ `మైఖేల్` సాధించిన డైలీ రికార్డులను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. ఇటీవలి కాలంలో భారీ రికార్డులు బ్రేక్ చేసిన భారతీయ చిత్రాలు `దురంధర్` (1200 కోట్లు), `దురంధర్ 2` (1800 కోట్లు) కూడా 1000 కోట్ల క్లబ్‌ను అధిగ‌మించిన‌ మాట నిజమే అయినా.. ఆ సినిమాల కోసం ఏకంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్లు పెట్టాల్సి వచ్చింది. కానీ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ `అబ్సెషన్` చిత్రం మాత్రం ఆ భారీ చిత్రాల బడ్జెట్లతో పోలిస్తే అత్యంత అల్ప వ్యయంతోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అంటే తన వాస్తవ పెట్టుబడి కంటే ఏకంగా 100 రెట్లు అధికంగా వసూలు చేసి... ఇంకా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటను సాగిస్తోంది.

ఇండే నవరెట్, కర్రీ బార్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వినూత్న హారర్ చిత్రం అత్యంత భయానకమైన, అత్యంత హింసాత్మకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతోందని ఆడియన్స్ చెబుతున్నారు. ఒక చిన్న సినిమా ఇలా ప్రపంచ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోందంటే.. అసలు ప్రేక్షకులకు ఇందులో ఏం నచ్చింది? ఏ విధమైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కవుట్ అయింది? అనే కోణాలు నేటితరం ఔత్సాహిక ఫిలింమేకర్స్‌కు ఒక పక్కా బాక్సాఫీస్ కేస్ స్టడీగా ఈ చిత్రం ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News