#NTRNEEL : పుకార్లకు చెక్‌ పెట్టేది ఎప్పుడు భయ్యా?

నందమూరి అభిమానులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.;

Update: 2025-11-05 05:29 GMT

నందమూరి అభిమానులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ గత చిత్రాలు దేవర ఆశించిన స్థాయిలో అలరించలేదు, బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన 'వార్‌ 2' సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట 2026 సంక్రాంతి కి సినిమా విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటన చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, ఇతర కారణాల వల్ల సినిమా విడుదల తేదీ మార్చారు. 2026 సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 2026 సమ్మర్‌ స్పెషల్‌గా ఎన్టీఆర్‌నీల్‌ సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌...

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న పుకార్ల నేపథ్యంలో ఎన్టీఆర్‌నీల్‌ మూవీ అసలు 2026 లో ఉండే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గాడు. కనిపించిన ప్రతి సారి కొంత మేరకు బరువు తగ్గినట్టు గా కనిపిస్తున్నాడు. దాంతో ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో ఎన్టీఆర్‌ కనిపించేది ఎలా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఇలాగే ఎన్టీఆర్‌ మరీ ఎక్కువ బరువు తగ్గడంతో విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్‌ మినిమం పర్సనాలిటీ ఉంటేనే మంచిగా కనిపిస్తాడు అనేది ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం. అందుకే ఆయన కాస్త బరువు పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ నీల్‌ సినిమా కోసం ఆయన బరువు తగ్గుతూనే ఉన్నాడు. గత కొన్నాళ్లుగా షూటింగ్‌ లేకున్నా కూడా ఎన్టీఆర్‌ సన్నగానే కనిపిస్తూ వస్తున్నాడు.

సలార్‌ తర్వాత ఎన్టీఆర్‌ తో ప్రశాంత్‌ నీల్‌ మూవీ..

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో విభేదాలు ఉన్నాయని, అందుకే షూటింగ్‌కు బ్రేక్ పడింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ అలాంటిది ఏమీ లేదు అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి ఆఫ్ ది రికార్డ్‌ సమాచారం అందుతోంది. ప్రశాంత్‌ నీల్‌ ఏ సినిమాకు అయినా కొంత మేరకు షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత బ్రేక్ తీసుకుని, మిగిలిన స్క్రిప్ట్‌ ను రెడీ చేసుకుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాకు అదే జరుగుతుంది అంటూ ఆయనకు సన్నిహితులుగా చెప్పుకుంటున్న వారు అంటున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం నీల్‌ సినిమా తదుపరి షెడ్యూల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడని, రెండు నెలల గ్యాప్‌ తర్వాత వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ డిసెంబర్‌లో దాదాపుగా 20 రోజుల పాటు ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.

కేజీఎఫ్‌ సినిమా స్థాయిలో ఎన్టీఆర్‌ మూవీ...

ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాలు కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2, సలార్‌ 1 సినిమాలు సాధించిన హిట్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో రూపొందిస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా విషయంలో మాత్రం రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. ఎన్టీఆర్‌ లుక్ మొదలుకుని, షూటింగ్‌ ఆలస్యం వరకు చాలా విషయాల్లో ఉన్న అనుమానాలకు ప్రశాంత్‌ నీల్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా నుంచి టీజర్‌ లేదా గ్లిమ్స్ వీడియో వచ్చి, విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చే వరకు మీడియాలో ముఖ్యంగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు, పుకార్లకు తెర పడే పరిస్థితి లేదని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ప్రశాంత్‌ వర్మ ఏం చేస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News