థియేటర్లో ఆకతాయిల బెడద..మధ్యలోనే బయటకు వచ్చేసిన మహిళ!
ఇండియా వైడ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న `మిర్జాపూర్` ఫ్రాంచైజ్ ఆధారంగా తెరకెక్కిన `మిర్జాపూర్: ది మూవీ`ని వెండితెరపై చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఇండియా వైడ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న `మిర్జాపూర్` ఫ్రాంచైజ్ ఆధారంగా తెరకెక్కిన `మిర్జాపూర్: ది మూవీ`ని వెండితెరపై చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే నోయిడాకు చెందిన మహిళకు ఈ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్‌లోని ప్రేక్షకుల అసభ్యకర ప్రవర్తన, అల్లరి కారణంగా ఆమె సినిమాను పూర్తిగా చూడలేక తీవ్ర ఆవేదనతో ప్రదర్శన మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ సంఘటనపై సదరు మహిళ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అవ్వడంతోనే విషయం వెలుగులోకివచ్చింది.
థియేటర్‌లో కొందరు వ్యక్తులు మితిమీరిన అరుపులు, విజిళ్లు వేయడమే కాకుండా, పక్కన ఉన్న ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించారని పేర్కొంది. సినిమాను ప్రశాంతంగా వీక్షించే వాతావరణం అక్కడ ఎంత మాత్రం లేకపోవడంతో మిగిలిన సినిమాను చూడటం కంటే అక్కడి నుంచి బయటకు వెళ్లడమే మంచిదని నిర్ణయిం చుకున్నట్లు తెలిపారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకు థియేటర్లలో రచ్చ చేయడం సాధారణమే అయినా? కుటుంబాలతో లేదా ప్రశాంతంగా సినిమా చూడటానికి వచ్చే సాధారణ ప్రేక్షకులకు ఇది తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడింది.
ముఖ్యంగా మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకుల భద్రత, ప్రశాంతత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సదరు మహిళ అసహనం వ్యక్తం చేసింది. నోయిడా మహిళ అల్లరి మూకలనే కాకుండా థియేటర్ యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. థియేటర్ లోపల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని నియంత్రించడంలో లేదా వారిపై చర్యలు తీసుకోవడంలో మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమైందని మండిపడింది. టికెట్లు కొనుగోలు చేసి వచ్చే ప్రేక్షకులకు సరైన అనుభవాన్ని, భద్రతను అందించాల్సిన బాధ్యత యాజ మాన్యానిదేనని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది నెటిజన్లు సదరు మహిళకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో కూడా ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందని, థియేటర్లలో భద్రతా నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమా హాల్స్ అల్లరి మూకల కేంద్రాలుగా మారకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలి కాలంలో థియేటర్లలో ప్రేక్షకుల ప్రవర్తన, డిజిటల్ యంత్రాల అతి వినియోగంపై వివాదాలు తరచుగా తలెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు సినీ ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని దూరం చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యాజమాన్యాలు తక్షణమే స్పందించి థియేటర్లలో కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. అలాగే మల్టీప్లెక్స్ ల్లో సినిమా చెప్పిన సమయానికి వేయడం లేదని... సినిమా ప్రారంభానికి ముందు అరగంట పాటు యాడ్స్...ఇంటర్వెల్ సమయంలోనూ అర్దగంట ప్రకటనలకే కేటాయిచడంపై ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పేరుతో యాజమాన్యాలు ప్రేక్షకుల విలువైన సమయాన్ని వృద్దా చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యాలు సీరియస్ గా తీసుకుని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో మల్టీ ప్లెక్సుల్లో సినిమా ను బ్యాన్ చేసే దిశగా ప్రేక్షకులులే అడుగులు వేయాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కోరుతున్నారు.