మాస్ రాజా బాడీలాంగ్వేజ్ కనిపిస్తోందయ్యో బుల్లి భూపతిరాజా!
తాజాగా జరిగిన `మారెమ్మ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ మహారాజా రవితేజ తన తమ్ముడి కొడుకు మాధవ్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వధించారు.
టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉందని నిరూపించారు. తనదైన బాడీ లాంగ్వేజ్..ఆకట్టుకునే ఆహార్యం.. ఉత్సాహం ఎనర్జీతో కూడిన డైలాగ్ డెలివరీ.. ఊర మాస్ అప్పియరెన్స్‌తో ఆయన పరిశ్రమలో ప్రత్యేకమైన హీరోగా నిలిచారు. ఇప్పుడు రాజా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అతడి సోదరుడే అయిన నటుడు రఘు రాజు కుమారుడు మాధవ్ భూపతిరాజు సినీ రంగప్రవేశం చేస్తున్నారు. అతడు కథానాయకుడిగా నటించిన `మారెమ్మ` చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని మాధవ్ నటన ప్రేక్షకులను.. సినీ వర్గాలను ఆకట్టుకుంది.
తాజాగా జరిగిన `మారెమ్మ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాస్ మహారాజా రవితేజ తన తమ్ముడి కొడుకు మాధవ్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వధించారు. ఈ వేదికపై మాధవ్ ప్రసంగించిన తీరు.. అతడి బాడీ లాంగ్వేజ్.. మాట తీరు..ఆహార్యం హుటాహుటిన పెదనాన్న రవితేజను గుర్తుకు తెచ్చాయి. వేదికపై మాట్లాడేటప్పుడు ఆయన చూపించిన ఈజ్ - కాన్ఫిడెన్స్ చూసిన సినీ ప్రేమికులు ``బుల్లి భూపతిరాజులో కొంచెం పెదనాన్న మాస్ రాజా బాడీలాంగ్వేజ్ కనిపిస్తోందయ్యో!`` అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రవితేజ బాటలోనే మాధవ్ భూపతి రాజు కూడా పెద్ద హీరో అవుతాడా? మాస్ మహారాజా లెగసీని ముందుకు నడిపిస్తాడా? లేదా రవితేజ సిసలైన వారసుడైన మహాధన్ భూపతి రాజు బరిలోకి దిగాల్సి ఉంటుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రవితేజ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన ఇడియట్, చంటిగాడు తరహా లోకల్ మాస్ పాత్రల్లో మాధవ్ అలరించగలడా? లేదా `విక్రమార్కుడు` జింతాత రేంజ్‌లో ఉతికి ఆరేస్తాడా? అనేది వెండితెరపైనే చూడాలి.
తనలోని మాసిజాన్ని ఎలివేట్ చేసే సరైన రూటెడ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్‌ను తొలి సినిమా(మారెమ్మ)కే ఎంచుకోవడం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. `మారెమ్మ` చిత్రం సాధించే విజయం మాధవ్ భూపతిరాజు లైఫ్ అండ్ కెరీర్‌ను డిసైడ్ చేయనుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి కొత్త రక్తం ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో సరైన కంటెంట్ ఉంటే కటౌట్‌తో సంబంధం లేకుండా తేజ సజ్జా తరహాలో చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో చెలరేగిపోతున్నారు. అదే సమయంలో మంచి కటౌట్ కూడా తోడైతే ప్రభాస్ రేంజ్‌కు ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
మరి ఈ నవతరం హీరో మాధవ్ భూపతిరాజు తన తొలి ప్రయత్నంలో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. పెదనాన్న కాదు కానీ అన్నయ్య రవితేజ ఆశీస్సులతో.. సరికొత్త మాస్ అప్పియరెన్స్‌తో తెరకు పరిచయమవుతున్న ఈ బుల్లి భూపతిరాజు తన డెబ్యూ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ మేర సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.