'బెంజ్' బాబు మ‌రో అబ్రార్ రేంజు?

స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ లాగా హార్డ్ గా కూడా ఉంటే అది బోన‌స్. అలాంటి ఒక పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని అన్నాడు నివిన్ పౌళి. ఈ మ‌ల‌యాళ న‌టుడు ప్ర‌స్తుతం `బెంజ్` అనే త‌మిళ‌ చిత్రంలో న‌టిస్తున్నాడు.;

Update: 2025-12-13 18:25 GMT

ఇటీవ‌లి కాలంలో క్రూర‌త్వానికి క్రేజ్ పెరిగింది. యానిమ‌ల్ అబ్రార్‌లా, ఉన్ని ముకుంద‌న్ `మార్కో`లా క్రూరంగా పాశ‌వికంగా ఉంటే ఆ పాత్ర‌కు ప్ర‌త్యేక‌ గుర్తింపు ద‌క్కుతోంది. స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ లాగా హార్డ్ గా కూడా ఉంటే అది బోన‌స్. అలాంటి ఒక పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని అన్నాడు నివిన్ పౌళి. ఈ మ‌ల‌యాళ న‌టుడు ప్ర‌స్తుతం `బెంజ్` అనే త‌మిళ‌ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నివిన్ పాత్ర‌కు సంబంధించిన లుక్ విడుద‌ల కాగా, దీనిని చూడ‌గానే అభిమానులు షాక్‌కి గుర‌వుతున్నారు.

యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త‌న పాత్ర చాలా క్రూరంగా ఉంటుంద‌ని, త‌న కెరీర్ మొత్తంలోనే అత్యంత క్రూరమైన పాత్రలలో ఒకటి అని అభివర్ణించాడు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో వాల్టర్ అనే క్రూరమైన, భయంకరమైన విల‌న్ పాత్రలో నివిన్ అద్భుతాలు చేయ‌బోతున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇక ఈ పాత్రలోకి మారేందుకు అత‌డు చాలా క‌ఠిన నియ‌మాల‌ను అనుస‌రిస్తున్నాడు. అత‌డి రూపంతో పాటు ప్ర‌వ‌ర్త‌న‌ను కూడా చాలా మార్చుకున్నాన‌ని చెప్పాడు. దూకుడుగా దుందుడుకు స్వ‌భావం చూపించేవాడిగా, ఎటు చూసినా తెర నిండా హింసకు తెర తీసేవాడిగా క‌నిపిస్తాన‌ని అత‌డు అన్నాడు. ఈ సినిమా క‌థ క‌థ‌నం రీత్యా `ర‌క్త‌పు బొట్టు` ప‌డాల్సిందేన‌ని తెలిపాడు.

నిజానికి నివిన్ కి మొద‌ట ఈ పాత్రను ఆఫ‌ర్ చేయ‌లేదు. వేరొక స‌హాయ‌క పాత్ర‌ను ఆఫ‌ర్ చేసారు. కానీ నివిన్ ప‌ట్టుప‌ట్టి మ‌రీ ఈ పాత్ర‌ను తాను చేస్తాన‌ని ఒప్పించాడ‌ట‌. విల‌న్ పాత్ర‌లో న‌టిస్తే, ఏ న‌టుడికి అయినా మైలేజ్ పెరుగుతుంది. ఈ పాత్ర‌లో విభిన్న‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ప‌లికించేందుకు ఆస్కారం ఉంది.

మలయాళం- తమిళ సినిమా మధ్య తేడాల గురించి ఒప్పుకున్న నివిన్ తన నటనా శైలి, డైలాగ్ డెలివరీ రెండింటినీ పాత్ర విభిన్న లయ- తీవ్రతకు అనుగుణంగా మార్చుకున్నానని చెప్పాడు. క్రూర‌త్వంతో పాటు, కామెడీ ట‌చ్ ఉన్న పాత్ర ఇది. మూవీలో డార్క్ కామెడీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తుంది. అలాగే తన పాత్ర కోసం నివిన్ చాలా మేకోవ‌ర్ ట్రై చేసాన‌ని కూడా తెలిపాడు. ఇలాంటి మేకోవ‌ర్ నిజానికి సాహ‌సోపేత‌మైన‌ది. త‌న‌ను తాను చాలా సంసిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాత్ర‌ నా కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా ఉంటుందని, ప్రేక్షకులకు ఊహించని కొత్త‌ద‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాన‌నే సంతృప్తి ఉంటుంద‌ని కూడా అన్నారు. అయితే ఈ పాత్ర‌ను చూడగానే ఇప్ప‌టికే ప్ర‌జ‌లు చూసేసిన‌ అబ్రార్ లోని క్రూర‌త్వం, పుష్ప‌రాజ్ లేదా మంగ‌ళం శ్రీ‌ను వేష‌ధార‌ణ‌తో క‌నిపిస్తోంద‌ని కూడా కామెంట్ చేస్తున్నారు.

`బెంజ్` చిత్రానికి లోకేష్ కనగరాజ్ నిర్మాత‌. లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్‌.సి.యు)లో ఇది ఒక భాగం. క‌న‌గ‌రాజ్ గ‌త చిత్రాల త‌ర‌హాలోనే లేయర్డ్ యాక్షన్ - ఇంటర్‌కనెక్టడ్ స్టోరీ టెల్లింగ్ య‌థావిధిగా బెంజ్ లోను క‌నిపిస్తాయి. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ మ‌రో కీల‌క పాత్ర‌లో నటించారు. సంయుక్త త‌దితరులు కూడా చిత్ర‌బృందంలో చేరారు.



Tags:    

Similar News