దుల్కర్ వస్తే ఆ రేంజ్.. నా విషయంలో మాత్రం ఇలానా సుమా!
సినిమా వేడుకల్లో హీరో నితిన్ ఎప్పుడూ తక్కువగా, చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంటారు. కానీ 'అలియాస్ రుక్మిణి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం రూట్ మార్చి యాంకర్ సుమను స్టేజ్ మీదే ఇరికించేశారు. తన స్పీచ్ మొదలుపెట్టకముందే సుమ మీద ఒక సరదా కంప్లైంట్ విసిరి ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కోసం నితిన్ స్వయంగా సుమ ఇంటికి వెళ్లారట.
అప్పుడు సుమ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండిపోతే, నితిన్ పైకి వెళ్లి ఆయనే ముందుగా హగ్ ఇచ్చి పలకరించారు. కానీ కొన్ని రోజుల తర్వాత టీవీలో అదే షోలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఎపిసోడ్ చూసి నితిన్ షాక్ అయ్యారట. దుల్కర్ కారు దిగగానే సుమ పరుగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకోవడం, స్వీట్లు తినిపించడం, ఏకంగా వాళ్ల అమ్మగారిని కూడా పిలిచి పరిచయం చేయడం చూసి నితిన్ స్టేజ్ మీదే నిలదీశారు.
సొంత భాష వాళ్లు రాగానే మీ అడ్డాలో ఇంత హడావుడి చేస్తారా అని పంచ్ వేశారు. దీనికి సుమ కూడా అంతే వేగంగా స్పందిస్తూ, కేరళలో ఉన్న తమ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో వీడియోలు పెట్టడానికే ఆ రేంజ్ బిల్డప్ ఇచ్చానని నవ్వుతూ కవర్ చేశారు. ఆ రోజు మిస్ అయిన హగ్ ను స్టేజ్ మీదే ఇచ్చి లెక్క సరిచేశారు. సరదా పంచ్ లతో పాటు నితిన్ మాటల్లో ఈసారి ఒక కొత్త కాన్ఫిడెన్స్ కూడా స్పష్టంగా కనిపించింది.
గత రెండేళ్లుగా సరైన హిట్లు లేక, మంచి కథలు దొరక్క నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నారు. అయితే 'అలియాస్ రుక్మిణి' కథ విన్న రోజు నుంచి మళ్లీ ఎలాంటి ట్యాబ్లెట్లు లేకుండా ప్రశాంతంగా నిద్రపడుతోందని చెప్పడం ఆయన కెరీర్ లో ఈ సినిమా ఎంత కీలకమో చూపిస్తోంది. నితిన్ లోయెస్ట్ ఫేస్ లో ఉన్నప్పుడు మిత్రుడు నాని ఒక దేవుడిలా వచ్చి ఈ కథను చేతిలో పెట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు.
మరోవైపు నిర్మాత దీప్తి గంటా ప్లానింగ్ చూస్తుంటే, తనకు 'దిల్' సినిమా టైమ్ లో దిల్ రాజు గుర్తొచ్చారని ప్రశంసించారు. దర్శకుడు మురళి రైటింగ్, విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు కొత్త హీరోయిన్ ఆఫియా, సాయి కుమార్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. నాని విసిరిన ఛాలెంజ్, సుమతో నితిన్ చేసిన సరదా పంచ్ లతో 'అలియాస్ రుక్మిణి'పై మంచి బజ్ క్రియేట్ అయింది. సాంగ్స్ కూడా బాగా క్లికయ్యాయి. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.