సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్న నిఖిల్!
విభిన్నమైన కథలని ఎంచుకుంటూ హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు హీరో నిఖిల్. వరుస సక్సెస్‌లతో కొత్త తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకున్నాడు;
విభిన్నమైన కథలని ఎంచుకుంటూ హీరోగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు హీరో నిఖిల్. వరుస సక్సెస్‌లతో కొత్త తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి హిట్‌ల తరువాత నిఖిల్ తన పట్టుకోల్పోయినట్టున్నాడు. కారణం తను చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లాయో తెలియకుండానే వెళ్లిపోయాయి. వరుసగా ఫ్లాప్‌లని అందించి నిఖిల్‌కు బ్యాక్ టు బ్యాక్ షాక్ ఇచ్చాయి.
దీంతో ఆలోచనలో పడ్డ నిఖిల్ కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ తన పంథాలో భారీ సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న రెండు సినిమాలు కూడా పీరియాడిక్ నేపథ్యం ఉన్నవే కావడం విశేషం. కొత్త దర్శకులు భరత్ కృష్ణమాచారితో `స్వయంభు`, రామ్ వంశీ కృష్ణతో `ది ఇండియా హౌస్` చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో `ది ఇండియా హౌస్` మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాల్లో `స్వయంభు` ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంయుక్త మీనన్, నభా నటేష్ ఇందులో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇంతు ముందు వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పైప్రత్యేక దృష్టి పెట్టాడు. సినిమాలో యోధుడిగా నటిస్తుండటంతో దీనికి సంబంధించిన విద్యల్లో ఆరితేరడం కోసం ప్రత్యేకంగా వియత్నాం వెళ్లాడు. అక్కడే 45 రోజులు పాటు ప్రత్యేక నిపుణుల ఆధ్వర్యంలో గుర్రపు స్వారీ, రెండు చేతులతో కత్తి సాము, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు.
నిఖిల్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ఫిబ్రవరి 13న భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారినట్టుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 13న కాకుండా మార్చి, లేదా ఏప్రిల్‌లో ఈ మూవీని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. త్వరలోనే మారిన రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే పీరియాడిక్ స్టోరీతో ప్రతిష్టాత్మక దీన్ని తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో నిలిచిన ఓ యోధుడి కథగా రూపొందుతున్న ఈ సినిమా కథ శక్తికి, ధర్మానికి చిహ్నంగా నిలిచే సెంగోల్ నేపథ్యంలో సాగుతుందని, సినిమా అనుకున్న దానికి మించి బాగా వస్తోందని, సినిమా ఓ ఫుల్ సర్‌పైజ్‌ల ప్యాకేజ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సరికొత్త కథతో రూపొందుతున్న ఈ సినిమాతో నిఖిల్ మరోసారి పాన్ ఇండియా వైడ్‌గా సంచలనాలు సృష్టించడం ఖాయమని, సినిమా ఔట్‌పుట్ చూసిన వాళ్లు చెబుతున్నారు. అదే నిజమైతే నిఖిల్ `స్వయంభు`తో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టే.