ఈ వారం సినిమాలు.. 'పురుషః' దే డామినేషనా?

అయితే మొదటిగా దృశ్యం 3 విషయానికి వస్తే.. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మలయాళ హిట్ ఫ్రాంచైజీపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది.

Update: 2026-05-23 05:40 GMT

ఎప్పటిలాగే ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు విడుదలైనప్పటికీ.. ఆడియన్స్ దృష్టిని మెయిన్ గా ఆకర్షించినవి మాత్రం మూడు చిత్రాలే. అవి దృశ్యం 3, పురుషః, రమణి కళ్యాణం.. అయితే విడుదలకు ముందు ఉన్న అంచనాలు, రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ చూస్తే.. ఈ వీక్ పూర్తిగా పురుషః సినిమానే డామినేషన్ చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే మొదటిగా దృశ్యం 3 విషయానికి వస్తే.. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మలయాళ హిట్ ఫ్రాంచైజీపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 సినిమాలు తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో మూడో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించింది. ఈసారి తెలుగు రీమేక్ కాకుండా డబ్బింగ్ వెర్షన్‌ ను విడుదల చేశారు.

కానీ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోవడం, రిలీజ్ అవుతున్న విషయం చాలా మందికి తెలియకపోవడం ప్రభావం చూపించింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా.. తర్వాత మిక్స్‌ డ్ టాక్ రావడంతో సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫస్ట్ రెండు పార్టులు సూపర్ హిట్ అయినప్పటికీ మూడో పార్ట్ మాత్రం నిరాశపరిచినట్లే.

ఇక ఈ వీక్ అసలైన ఆకర్షణగా నిలిచింది పురుషః. కొత్త హీరో పవన్ కళ్యాణ్‌ తో పాటు వెన్నెల కిషోర్, సప్తగిరి, రాజ్‌ కుమార్ కసిరెడ్డి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఆ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫన్నీ ప్రోమోలు సినిమాపై ఆసక్తి పెంచగా.. థియేటర్లలో కూడా అదే స్థాయి వినోదం అందించిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌ లో వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది.

భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, వాటి వల్ల భర్తలు పడే ఇబ్బందులను ఫుల్ కామెడీ టచ్‌ తో దర్శకుడు వీరు ఉలవల చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. కొన్నిచోట్ల పాత సినిమాల ఛాయలు కనిపించినా.. కామెడీ టైమింగ్‌ తో ఆ లోటును కవర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కిస్సు పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించగా.. సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి కూడా నవ్వించారు.

కొత్త హీరో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రలో మంచి ఈజ్ చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌ లో పవన్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు కామెడీని ఇష్టపడే వారికి సినిమా మంచి ఆప్షన్‌ గా మారింది. అందుకే ప్రస్తుతం ఆ చిత్రానికి బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రమణి కళ్యాణం పూర్తిగా ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీప్షిక చంద్రన్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ సినిమాను టైటిల్‌ కు తగ్గట్టుగానే హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న కథగా దర్శకుడు నడిపించారు. వీల్‌ చైర్‌ కే పరిమితమైన పాత్రలో సూర్య నటన ప్రశంసలు అందుకుంటోంది. మొత్తానికి ఈ వీక్ విడుదలైన సినిమాల్లో దృశ్యం 3 ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా.. పురుషః, రమణి కళ్యాణం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు పురుషః బెస్ట్ ఛాయిస్‌ గా మారినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News