ప్ర‌శాంతత కోసం న‌ట‌న వ‌దిలేసిన న‌టి

80, 90వ దశకాల్లో వెండితెరపై, బుల్లితెరపై ప్రకటనలు టీవీ సీరియ‌ళ్ల‌లో మెరిసిన నటి నీషా సింగ్.;

Update: 2026-02-22 22:30 GMT

80, 90వ దశకాల్లో వెండితెరపై, బుల్లితెరపై ప్రకటనలు టీవీ సీరియ‌ళ్ల‌లో మెరిసిన నటి నీషా సింగ్. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఈ ట్యాలెంటెడ్ న‌టి పరిశ్రమకు దూరమవ్వడం వెనుక మిస్ట‌రీపై చాలా ప్ర‌చారం సాగింది.

నీషా సింగ్ తన 19వ ఏట ప్ర‌ఖ్యాత న‌టుడు నానా పటేకర్ సరసన ఒక చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. అయితే మొదట్లో నానా పటేకర్ ఆమెను చూసి ``ఈమె ఎవరో స్కూల్ పాపలా ఉంది.. నాతో ఏం నటిస్తుంది?`` అని విముఖత చూపారట. కానీ షూటింగ్ పూర్తయ్యేసరికి ఈ ప్ర‌తిభావ‌ని నటనకు ఫిదా అయిపోయి, తర్వాత ఆమెనే తన `బెస్ట్ కో-స్టార్` అని ప్రశంసించారు.

చాలా మంది నటీమణులు అవకాశాలు లేకనో, పెళ్లి చేసుకొనో సినిమాలకు దూరమవుతారు. కానీ నీషా సింగ్ విషయంలో కారణం వేరు. అత్యాశ లేకపోవడం.. సంపాద‌నా పిచ్చి లేక‌పోవ‌డంతో న‌ట‌నా రంగాన్ని లైట్ తీసుకున్నారు. ఆమెకు తన వృత్తిపై ఎంతో గౌరవం ఉన్నా కానీ, సెలబ్రిటీ హోదా ఇచ్చే ఒత్తిడిని భరించలేకపోయారట‌. అప్పట్లో షూటింగ్ సెట్స్‌లో ఉండే వాతావరణం.. ముఖ్యంగా మహిళా నటీమణుల విష‌యంలో ఉండే ధోరణి నిషాకు నచ్చలేదు. ప్రతిరోజూ ఒకే రకమైన మెకానికల్ లైఫ్ గడపడం కంటే ప్రశాంతమైన జీవితం ముఖ్యమని భావించారట‌. గ్లామర్ ప్రపంచం ఇచ్చే పేరు ప్రఖ్యాతుల కంటే తనకంటూ కొంత వ్యక్తిగత సమయం కావాలని కోరుకుని ఆమె స్వచ్ఛందంగా విరామం తీసుకున్నారు.

నీషా సింగ్‌కు అత్యంత గుర్తింపు తెచ్చిన సీరియల్ `బునియాద్`. ఇందులో త‌న‌ నటనకు అప్పట్లో ఇంటింటా అభిమానులు ఉండేవారు. టెలివిజన్ రంగంలో స్టార్‌గా ఎదిగిన సమయంలోనే న‌ట‌న‌కు దూరం కావడం అప్పట్లో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. చాలా ఏళ్ల తర్వాత నిషా సింగ్ ఇప్పుడు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ.. అప్పుడు తీసుకున్న నిర్ణయంపై తనకు ఎలాంటి విచారం లేదని తెలిపారు. ప్రస్తుతం ఒక డిజైనర్‌గా తన సాధార‌ణ‌ జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు.

ఒక నటిగా గొప్ప భవిష్యత్తు ఉన్నా కానీ, కేవలం ప్రశాంతత కోసం గ్లామర్ ప్రపంచాన్ని వదులుకోవడం అనేది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. నేటి తరం నటీమణులకు ఆమె ఒక రకమైన స్ఫూర్తి అని చెప్పవచ్చు.

Tags:    

Similar News