తండేల్.. చైతూకి ఎందుకంత స్పెషల్ అంటే..
నాగచైతన్యకు మరో అవార్డు దక్కింది. తండేల్ రాజు పాత్రకు సైమాలో బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు.
నాగచైతన్యకు మరో అవార్డు దక్కింది. తండేల్ రాజు పాత్రకు సైమాలో బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. ఇదే పాత్రకు ఇప్పటికే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, ఐఎన్‌సీఏ వేదికలపై కూడా అవార్డులు వచ్చాయి. చైతూ కెరీర్‌లో మంచి నటన గురించి మాట్లాడుకున్న సినిమాలు చాలానే ఉన్నా, ఒకే పాత్రకు ఇలా మూడు పెద్ద వేదికలపై గుర్తింపు రావడం మాత్రం తాండేల్‌తోనే జరిగింది.
ప్రేమమ్ టైమ్‌లోనే చైతూ నటనపై మంచి కామెంట్స్ వచ్చాయి. మూడు దశల్లో కనిపించే విక్రమ్ పాత్రలో లుక్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నారు. మజిలీలో పూర్ణ పాత్ర ఆయన కెరీర్‌లో ఎక్కువగా గుర్తుండిపోయిన వాటిలో ఒకటి. లవ్ స్టోరీలో రేవంత్‌గా తెలంగాణ యాసతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా కుదిరాయి. ఈ సినిమాలన్నీ చైతూను నటుడిగా మరో స్థాయికి తీసుకు వెళ్ళాయి. కానీ అవార్డుల విషయంలో తండేల్ స్థాయిలో గుర్తింపు రాలేదు.
తండేల్ రాజు పాత్ర కోసం చైతూ చాలా హార్డ్ వర్క్ చేసి ఎక్కువ సమయం తీసుకున్నాడు. శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్లి మత్స్యకారులను కలిశారు. వాళ్ల మాట తీరు, యాస, సముద్రంలో పని చేసే విధానం గమనించారు. జుట్టు, గడ్డంతో లుక్ మార్చుకోవడంతో పాటు జనాలకు క్లోజ్ గా కనెక్ట్ అయ్యాడు. రాజు పాత్ర మాట్లాడే విధానం నుంచి నడిచే తీరు వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా చూసిన తర్వాత కూడా ఆ యాస, కొన్ని భావోద్వేగ సన్నివేశాల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.
చైతూకి తండేల్ బాక్సాఫీస్ పరంగా కూడా ఒక రికార్డు. కెరీర్‌లో తొలిసారి రూ.100 కోట్ల గ్రాస్ దాటిన సినిమా ఇదే. గతంలో నటనకు పేరు తెచ్చిన మజిలీ, లవ్ స్టోరీ మంచి విజయాలు సాధించినా ఈ స్థాయి వసూళ్లు రాలేదు. తండేల్ లో మాత్రం నటనకు వచ్చిన గుర్తింపుతో పాటు కెరీర్‌లోనే పెద్ద బాక్సాఫీస్ ఫలితం కూడా దక్కింది.
డైరెక్టర్ చందూ మొండేటితో చైతూకి ఇది మూడో సినిమా. ప్రేమమ్ ఇద్దరికీ మంచి ఫలితం ఇచ్చింది. సవ్యసాచి మాత్రం ఆశించినట్టు ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ కలిసి చేసిన తండేల్ లో చైతూను పూర్తిగా కొత్త రూపంలో చూపించారు. ప్రేమకథతో పాటు మత్స్యకారుల జీవితం, పాకిస్థాన్ జైలు నేపథ్యం ఉండటంతో రాజు పాత్రలో చాలా మార్పులు చూపించే అవకాశం కూడా దొరికింది.
తండేల్ తర్వాత చైతూ ఇప్పుడు వృషకర్మ చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మిస్టరీ, అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ లలో చైతూ లుక్ గత సినిమాలకు భిన్నంగా ఉంది. తాండేల్ రాజుతో నటనకు మూడు పెద్ద అవార్డులు అందుకున్న తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.