NBK పాన్ ఇండియా ప్లాన్ ఆ రేంజులో?
ఇటీవలి కాలంలో యాక్షన్ సరళి మారింది. ఇది మునుపటితో పోలిస్తే అధిక రక్తపాతంతో ఉత్పాతంలా మారింది.;

ఇటీవలి కాలంలో యాక్షన్ సరళి మారింది. ఇది మునుపటితో పోలిస్తే అధిక రక్తపాతంతో ఉత్పాతంలా మారింది. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్లు, క్రిమినల్స్ అరాచకాలను ఘోరాతిఘోరంగా తెరపై చూపిస్తున్నారు. మార్కో చిత్రంలోను క్రైమ్ పరాకాష్ఠ ఎలా ఉంటుందో మలయాళ దర్శకుడు హనీఫ్ అదేనీ చూపించారు. ఈ సినిమా యువ నటుడు ఉన్ని ముకుందన్ కెరీర్ లో ఊహించని బ్లాక్ బస్టర్. ఆ తర్వాత దర్శకుడు హనీఫ్ గురించి కూడా ఆరాలు కొనసాగాయి. మాస్ ని థియేటర్లకు రప్పించే యాక్షన్ ప్యాక్డ్ సినిమాలను అతడు గ్రిప్పింగ్ గా తీయగలడని ప్రూవైంది.
ఇలాంటి సమయంలో హనీఫ్ తెలివిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇక్కడ దిల్ రాజు లాంటి దిగ్గజ నిర్మాతతో కలిసి మాస్ లో ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ కోసం అద్భుతమైన కాప్ డ్రామా స్టోరీని వినిపించి ఓకే చేయించుకున్నాడని కథనాలొచ్చాయి. ఎన్బీకేతో సినిమా అంటే అది భారీ కాన్వాసుతో ఉంటుంది. బాలయ్యతో మొదటి సారి పని చేస్తున్న దిల్ రాజు ఎందులోనూ రాజీకి రారు. అందువల్ల ఈ సినిమా కూడా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుందని భావిస్తున్నారు.
బోయపాటితో `అఖండ 2`ను భారీగా ప్లాన్ చేయడంతో ఇక ఎన్బీకే కూడా పాన్ ఇండియా రేస్ లోకి వచ్చినట్టే. సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడని అంతా భావిస్తారు. కానీ అఖండ 2 తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమవుతుందని బాలయ్య నమ్మకంగా చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అఖండ 2తో ఉత్తరాదినా హవా చాటి, అటుపై వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తానేంటో చూపించాలని బాలయ్య కలలు కంటున్నారని అర్థమవుతోంది.
ఇటు బుల్లితెర, అటు పెద్ద తెర రెండు చోట్లా హవా సాగిస్తున్న ఎన్బీకే హిందీ బెల్ట్ లో మార్కెట్ ని పెంచుకోవాలని గట్టి వ్యూహంతోనే ఉన్నట్టున్నాడు. అందువల్ల మార్కో దర్శకుడు హనీఫ్‌తోను బాలయ్య పాన్ ఇండియా మూవీనే ప్లాన్ చేస్తారని ఊహిస్తున్నారు. అయితే హనీఫ్ ఈ సినిమాని వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ఈనెల 10న ఎన్బీకే పుట్టినరోజు కానుకగా అఖండ 2 టీజర్ విడుదల కానుంది. ఇది బాలయ్య కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇలాంటి సమయంలో హనీఫ్ తెలివిగా ఎన్బీకే కోసం భారీతనం నిండిన స్క్రిప్టును వర్కవుట్ చేస్తాడేమో చూడాలి.