నయనతార ప్రచారం వెనుక సీక్రెట్ అదా?
లేడీ సూపర్ స్టార్ నయనతార `మన శంకర వరప్రసాద్ గారు` ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటున్నారో తెలిసిందే.;
లేడీ సూపర్ స్టార్ నయనతార 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటున్నారో తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందే ప్రీలాంచ్ ప్రమోషన్ తో అదరగొట్టారు. ఆ వీడియోలు చూసి నయన్ అభిమానులు సహా ప్రేక్షకులు షాక్ అయ్యారు. నయనతార ప్రచారంలో పాల్గొనడం ఏంటి అని చర్చించుకున్నారు. ప్రచారమంటే ఆమడు దూరంలో ఉండే నయనతారే ఇదంతా చేస్తుందా? అని విస్తుపోయారు. చివరకు దర్శకుడు అనీల్ రావిపూడి చొరవ సహా చిరంజీవి సినిమా అనే కారణంగానే కండీషన్ పక్కనబెట్టినట్లు భావించారు.
తాజాగా ఇదే సినిమాకు సంబంధించి మరో ప్రమోషనల్ వీడియోలో కూడా నయన్ దర్శనమిచ్చారు. అందులోనూ అనీల్ రావిపూడితో కలిసి ప్రచారం చేసారు. దీంతో నయనతార ప్రచారం వెనుక స్ట్రాటజీ ఏంటి? అనే ఆరాలు మొదలయ్యాయి. ఉన్న పళంగా కొత్తగా ఈ మార్పు దేనికంటూ సర్వత్రా చర్చకొస్తుంది. ఈ నేపథ్యంలో లేడీ సూపర్ స్టార్ రూట్ మార్చిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ల మధ్య పోటీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. సినిమా హిట్ అయిందంటే? పాన్ ఇండియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు.
ఓ పది సినిమాల్లో నటించాల్సిన పనిలేదు. కథాబలమున్న ఒక్క సినిమా చేసినా? ఇండియా అంతటా వెలిగిపోతున్నారు. సౌత్ భామల మధ్య పోటీ రెట్టింపు అవుతుంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికెళ్లి అక్కడా సత్తా చాటాతున్నారు. వీరంతా ఎలాంటి కండీషన్లు లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. సినిమా ప్రచార విధానం కూడా మారింది. కొత్త కొత్త పంథాని అనుసరించి జనాల్లోకి సినిమాను తీసుకెళ్తున్నారు. దీంతో నటీనటులకు రిలీజ్కు ముందే మంచి గుర్తింపు దక్కుతుంది. దాంతో పాటు ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా అలాగే కనిపిస్తోంది.
త్రిష, తమన్నా, సమంతా లాంటి భామలు అదే క్రేజ్ తో కొనసాగుతున్నారు. వీరంతా ప్రచారం పరంగా బేషరత్తుగా పాల్గొంటారు. ఎలాంటి కండీషన్లు లేకుండా సహకరిస్తారు. ఇవన్నీ విశ్లేషించుకునే నయనతార గత ఏడాదంటే కొత్త ప్రాజెక్ట్ లపై కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తుందా? అనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడి కిట్టీలో తొమ్మిది సినిమాలున్నాయి. ఇవన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటి ప్రచారంలో కూడా నయనతార పాల్గొంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదే జరిగితే? నయనతారకు మరో కోటి అదనంగా పారితోషికం చెల్లించడానికి నిర్మాతలు ఎంత మాత్రం వెనకడుగు వేయరు. 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రచారంలో పాల్గొన్నందుకు దర్శకుడు అనీల్ నయనతారకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు బంద్ అయినా? నయనతార మాత్రం ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అదనంగా సమయం కేటాయించి పని చేసారన్నారు. ఆమె అలా సహకరిం చడం వల్లే షూటింగ్ కూడా అనుకున్న టైమ్ కి పూర్తి చేసామన్నారు. తన కోసం ప్రమోషన్ చేసిన కారణంగా ఆమెకి కూడా బయట నుంచి ఒత్తిడి కూడా పెరిగిందన్నారు.