డ్రగ్స్ కేసు.. నటుడు నవదీప్ కు బిగ్ రిలీఫ్
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.;
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నవదీప్ ప్రమేయం లేదని, ఆయన వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటానికి ముగింపు పలికినట్లయింది.
నవదీప్ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ శుక్రవారం నాడు హైకోర్టులో వాదనలు వినిపించారు. డ్రగ్స్ కేసులో నవదీప్ ను చేర్చడానికి సరైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఇతర నిందితుల వివరాల ఆధారంగా మాత్రమే నవదీప్ పేరును కేసులో చేర్చారని, ప్రత్యక్షంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవదీప్ వద్ద డ్రగ్స్ స్వాధీనం కాలేదని, ఆయనపై నమోదైన ఆరోపణలు పూర్తిగా ఊహాగానాలేనని న్యాయవాది స్పష్టం చేశారు.
ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉండగా, హైకోర్టును ఆశ్రయించిన నవదీప్ కేసును కొట్టివేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, నవదీప్ పై నమోదైన కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చింది. నిందితుడిగా చేర్చేందుకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును కొనసాగించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడింది.
దీంతో కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో నవదీప్ కు న్యాయపరంగా పూర్తి ఊరట లభించింది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు పలుమార్లు ఆయనను విచారించారు. పలు విషయాలపై ప్రశ్నలు సంధించారు. అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు చివరగా హైకోర్టు ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది.
ఈ కేసు కారణంగా గత కొంతకాలంగా ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ పై కూడా ప్రభావం పడినట్లు పలువురు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు అనంతరం నవదీప్ అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం జరిగిందని, నిరాధార ఆరోపణల నుంచి ఆయన బయటపడినట్లు కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో డ్రగ్స్ కేసుల విషయంలో కఠిన చర్యలు అవసరమే అయినప్పటికీ, నిర్దోషులను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయకూడదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేయడం వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అంటున్నారు. నవదీప్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆధారాల ఇంపార్టెన్స్ ను మరోసారి స్పష్టం చేసినట్లయిందని చెబుతున్నారు. మొత్తానికి, నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు చట్టపరమైన ఊరట లభించింది.