ప్రభాస్ సింపుల్‌ గా సాల్వ్ చేస్తారా?

అయితే ఈసారి ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా టైటిల్ అంశం ఓ చిన్న నిర్మాత కుటుంబానికి పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతోంది.

Update: 2026-06-22 13:48 GMT

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల చుట్టూ వివాదాలు వస్తే అవి కోర్టుల వరకు వెళ్లడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా టైటిల్ అంశం ఓ చిన్న నిర్మాత కుటుంబానికి పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతోంది. తమ సినిమా విడుదల ఆగిపోయిందంటూ మహిళా రైతు నిర్మాత నర్సమ్మ చేసిన రిక్వెస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

8వ వండర్ సినిమాస్ బ్యానర్‌ పై మహిళా రైతు నర్సమ్మ నిర్మించిన స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా నిర్మాతల తరఫున టీ-సిరీస్ సంస్థ లీగల్ నోటీసులు పంపడంతో తమ సినిమా విడుదల ఆగిపోయిందని నర్సమ్మ ఆరోపిస్తున్నారు.

తమ చిత్రం స్పిరిట్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే సెన్సార్ పూర్తి చేసుకుందని, ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా నిర్వహించామని ఆమె తెలిపారు. గత నెలలో విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోస్టర్లు ప్రింట్ చేసిన సమయంలోనే నోటీసులు వచ్చాయని చెప్పారు. దీంతో సినిమా విడుదల నిలిచిపోయిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా నిర్మాణం కోసం చేసిన అప్పులు ఇప్పుడు భారంగా మారాయని నర్సమ్మ పేర్కొన్నారు. విడుదల కోసం సహాయం చేస్తామని ముందుకు వచ్చిన వారు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గారని చెప్పారు. గ్రామంలో తమపై అపోహలు ఏర్పడ్డాయని, కుటుంబం సొసైటీలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ ను ఉద్దేశించి నర్సమ్మ ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు.

తమకు ప్రభాస్‌ పై ఎంతో గౌరవం, అభిమానం ఉందని చెప్పారు. పెద్దల సమక్షంలో చర్చించి సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అవసరమైతే తమ సినిమా టైటిల్ మార్చుకోవడానికి కూడా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమ చిత్రంపై ఎలాంటి అభ్యంతరం లేదని టీ-సిరీస్ నుంచి లెటర్ ఇస్తే సినిమా విడుదల చేసుకునే అవకాశం ఉంటుందని నర్సమ్మ కోరుతున్నారు. పరస్పర అవగాహనతో సమస్యను ముగించాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు.

నర్సమ్మ కుటుంబానికి సినిమా చాలా స్పెషల్ గా చెబుతున్నారు. తమ కొడుకు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కుటుంబం ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తమ కుమారుడు ప్రస్తుతం లేడని, కనీసం అతడిని వెండితెరపై చూసుకోవాలన్న కోరికతోనే ఈ సినిమాను పూర్తి చేశామని చెప్పారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా తమలాంటి చిన్న నిర్మాతలపై లీగల్ నోటీసులు పంపారని నర్సమ్మ ఆరోపించారు.

ఒకసారి మాట్లాడి ఉంటే టైటిల్ మార్పుకు కూడా సిద్ధంగా ఉండేవాళ్లమని అన్నారు. కానీ ముందస్తు చర్చలు లేకుండానే నోటీసులు రావడంతో నష్టపోయామని తెలిపారు. అయితే సమస్యకు చట్టపరమైన పరిష్కారం కంటే పరస్పర చర్చల ద్వారానే ముగింపు రావాలని తాము కోరుకుంటున్నామని నర్సమ్మ స్పష్టం చేశారు. అయినప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టైటిల్ వివాదంపై స్పిరిట్ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో, అలాగే వివాదాలను కూల్ గా సాల్వ్ చేసే ప్రభాస్ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News