20 కోట్లు ఇవ్వ‌క‌పోతే లేపేస్తాం... స్టార్ డైరెక్ట‌ర్‌కి మాఫియా బెదిరింపులు!

ఒకప్పుడు బాలీవుడ్ సినీ ప్రముఖులను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వసూళ్లు, హత్యా బెదిరింపులతో ఎలా భయభ్రాంతులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే.

Update: 2026-06-29 10:55 GMT

ఒకప్పుడు బాలీవుడ్ సినీ ప్రముఖులను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వసూళ్లు, హత్యా బెదిరింపులతో ఎలా భయభ్రాంతులకు గురిచేసిందో అందరికీ తెలిసిందే. ఇటీవ‌ల కొన్నేళ్లుగా అండర్‌వరల్డ్ టెన్ష‌న్స్ లేకుండా ముంబై ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సెలబ్రిటీల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్య తర్వాత ముంబైలో భయాందోళనలు మరింత పెరిగాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు మరో సన్నిహితుడైన ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిని చంపేస్తామంటూ మాఫియా నుండి బెదిరింపులు రావడం ముంబై పోలీసు వర్గాలను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

బాలీవుడ్ యాక్షన్ చిత్రాల ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టికి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఇది రెండవసారి చంపేస్తామంటూ, ప్రాణభీతి హెచ్చరిక రావడం గమనార్హం. తాజా ఘటనలో 27 జూన్, శనివారం నాడు ఆయన ముంబై కార్యాలయానికి ఒక అనామక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్య‌క్తి ఏకంగా 20 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ, అడిగిన డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని... నేరుగా దాడి చేస్తామని రోహిత్ శెట్టి సిబ్బందిని హెచ్చరించాడు. దీంతో శెట్టి టీమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులను ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

ఈ భారీ వసూళ్ల డిమాండ్ , బెదిరింపుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉండవచ్చని ముంబై పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. గతంలో బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ జరిగిన అండర్‌వరల్డ్ వసూళ్ల పద్ధతికి, శనివారం వచ్చిన ఆడియో కాల్ వివరాలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు ఫోన్ రికార్డులు, వాయిస్ శాంపిల్స్‌ను సేకరించి.. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిశితంగా విచారణ జరుపుతున్నారు.

రోహిత్ శెట్టికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జుహులోని మెహమూద్ చౌక్ సమీపంలో ఉన్న ఆయన నివాసం వెలుపల కొందరు గుర్తుతెలియని దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. ఆ సమయంలో రోహిత్ శెట్టితో పాటు హీరో రణ్‌వీర్ సింగ్‌కు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు వాయిస్ నోట్స్ వచ్చాయి. అప్పట్లో పోలీసులు ఈ కాల్పుల కేసుకు సంబంధించి షూటర్ దీపక్ శర్మతో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినా బిష్ణోయ్ ముఠా ఆగడాలు మాత్రం ఇంకా తగ్గలేదని తాజా ఘటన నిరూపిస్తోంది.

వరుసగా బెదిరింపులు వస్తుండటంతో ముంబై పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఫిబ్రవరి ఘటన తర్వాతే రోహిత్ శెట్టికి రక్షణ కల్పించినా.. రెండోసారి హెచ్చరిక నేపథ్యంలో అత‌డి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శెట్టి ఇల్లు, ఆఫీసుల వద్ద సెక్యూరిటీని అదనంగా పెంచడంతో పాటు... అత‌డు నిత్యం తిరిగే ప్రాంతాల్లో సీసీటీవీ ) నిఘాను, పోలీసు పెట్రోలింగ్‌ను భారీగా పెంచారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తన సినిమాల పనులను (గోల్‌మాల్ 5, ఖత్రోన్ కే ఖిలాడీ) కొనసాగిస్తున్నా.. పూర్తి పోలీసు ప్రొటెక్షన్, ఊపిరాడ‌నివ్వ‌ని నిఘా నీడలో గడపాల్సి వస్తోంది.

Tags:    

Similar News