దివంగతులకు గౌరవం కావాలి… రాధికా శరత్ కుమార్ డిమాండ్
ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ అంత్యక్రియల సమయంలో మీడియా, యూట్యూబర్లు ప్రవర్తించిన తీరుపై సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ అంత్యక్రియల సమయంలో మీడియా, యూట్యూబర్లు ప్రవర్తించిన తీరుపై సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడసారి చూపు కోసం వచ్చిన వారికి అక్కడ ఎదురైన చేదు అనుభవాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చావు ఇంట్లో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడంపై మండిపడుతూ... దివంగత ప్రముఖులకు పూర్తి గౌరవాన్ని ఇచ్చేలా ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి సరైన ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
సర్కస్‌లా మారిన అంత్యక్రియలు:
భాగ్యరాజ్ భౌతికకాయాన్ని అంబులెన్స్ నుంచి ఇంటి లోపలికి తీసుకువచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు, యూట్యూబర్లు వ్యూస్ కోసం భారీగా గుమిగూడారు. ఫొటోలు, వీడియోల కోసం ఒకరినొకరు తోసుకుంటూ కనీస ప్రశాంతత లేకుండా చేశారు. ఇక ఈ పరిణామాలపై రాధిక తీవ్రంగా స్పందిస్తూ... ఎంతో హృద్యంగా, ప్రశాంతంగా సాగాల్సిన అంతిమ యాత్రను కొందరు సర్కస్‌లా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మా బాధను డ్రామాలా మార్చకండి:
తోపులాట జరుగుతున్న సమయంలో రాధికా శరత్ కుమార్ చేతులు జోడించి మీడియాను వేడుకున్నారు. "సినిమా మా పని మాత్రమే… కానీ అంతిమంగా మేమూ సాధారణ మనుషులమే" ఇక టీఆర్‌పీల కోసం, వ్యూస్ కోసం మీకు డ్రామా కావాలంటే అది నేను సినిమాల్లో చేసి చూపిస్తాను. దయచేసి ఇక్కడ మరణించిన వ్యక్తి కుటుంబానికి కాస్త ప్రైవసీ ఇవ్వండి" అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. భాగ్యరాజ్ కుమారుడు, నటుడు శంతనును ఆమె ఓదార్చారు.
తరలివచ్చిన ప్రముఖులు:
భాగ్యరాజ్ మరణవార్త తెలిసి ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చారు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చిన సమయంలో కూడా కెమెరాల హంగామా మితిమీరిపోవడంతో నివాళులర్పించడానికి వచ్చిన వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రత్యేక ప్రోటోకాల్ కావాలి:
ఇలాంటి సున్నితమైన సమయాల్లో ఎలా ప్రవర్తించాలనే దానిపై మీడియాకు ఒక లిమిట్ ఉండాలని రాధిక అభిప్రాయపడ్డారు.ఇక భవిష్యత్తులో దివంగత సెలబ్రిటీల కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా, వారికి పూర్తి గౌరవం దక్కేలా ప్రభుత్వాలు, చిత్ర పరిశ్రమ కలిసి ఒక ప్రత్యేక ప్రోటోకాల్‌ను, నిబంధనలను రూపొందించాలని ఆమె సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి కుటుంబం ఎలాంటి బాధలో ఉంటుందో మీడియా, యూట్యూబర్లు అర్థం చేసుకోవాలి. కేవలం వార్తలు, వ్యూస్ కోసమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ఏడుపులను కూడా క్యాష్ చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదంటూ రాధిక చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇక రాధిక చేసిన ఈ డిమాండ్‌కు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.