శర్వా.. మళ్లీ అలా జరిగే ఛాన్స్ ఉందా?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మంచి విజయం అందుకోలేకపోయిన ఆయన.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అందుకు అనుగుణంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు రెండు సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉండగా.. నిజానికి మరో మూడు రోజుల్లో బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 6వ తేదీన ఆ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వివిధ ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసి.. సినిమాపై ఆడియన్స్ లో బజ్ ను క్రియేట్ చేశారు.
కానీ ముందు రోజు అఖండ 2: ది తాండవం మూవీ రిలీజ్ అవ్వనుండగా.. బైకర్ విడుదల వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొంగల్ కు భారీ పోటీ ఉండడంతో రిలీజ్ ఆ సినిమా అవ్వదేమోనని వార్తలు వచ్చాయి.
అయితే కచ్చితంగా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని నారీ నారీ నడుమ మురారి మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే శర్వానంద్.. సంక్రాంతి సీజన్ కు శతమానం భవతి, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ సమయంలో భారీ పోటీ ఉన్నా.. ఆ రెండు చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి అనగనగా ఒక రాజు, జన నాయగన్ వంటి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. కానీ శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ పైనే నారీ నారీ నడుమ మురారి మేకర్స్ ఇప్పుడు నమ్మకం పెట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైనర్ జోనర్ లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా నారీ నారీ నడుమ మురారిని రామ్ అబ్బరాజు తెరకెక్కించగా.. కచ్చితంగా సినిమా అందరినీ అలరిస్తుందని ధీమాతో మేకర్స్ ఉన్నారు. భారీ పోటీ ఉన్నా.. థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఉన్నా.. మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి నారీ నారీ నడుమ మురారి ఎలా ఉంటుందో? శర్వా సంక్రాంతి సెంటిమెంట్ తో మూవీ హిట్ అయ్యే ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.