'గుర్రం పాపిరెడ్డి' అవుట్ ఫుట్ సూపర్.. అవే హైలైట్: హీరో నరేష్ అగస్త్య
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గుర్రం పాపిరెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. డార్క్ కామెడీ జానర్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తో సూపర్ బజ్ క్రియేట్ అవ్వగా.. కామెడీ, యాక్షన్, వినోదంతో ఆకట్టుకుంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ 19వ తేదీన గుర్రం పాపిరెడ్డి మూవీ రిలీజ్ అవ్వనుండగా.. మేకర్స్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కార్యక్రమంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత ఈవెంట్ కు అటెండ్ అయిన నిర్మాత అమర్ బూరాతోపాటు హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడారు.
గుర్రం పాపిరెడ్డి విజయానికి ప్రధాన కారణం దర్శకుడు మురళీ మనోహర్ అని నిర్మాత అమర్ తెలిపారు. ట్రైలర్ నుంచే ఆయన కష్టపడిన తీరు స్పష్టంగా కనిపిస్తుందని, సినిమా కంటెంట్ ను ఇప్పటికే అమెరికాలోని ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రశంసిస్తున్నారని చెప్పారు. దర్శకుడు మురళీతో ఇది మొదటి ప్రయాణమే అయినా, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కలిసి చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
ఆ తర్వాత సినిమాలో తాను సౌధామిని అనే పాత్రలో కనిపించనున్నట్లు ఫరియా తెలిపారు. డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ కథలో దర్శకుడు మురళీ మనోహర్ చూపిన ప్యాషన్, ఎమోషనల్ కమిట్ మెంట్ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక బలంగా నిలుస్తాయని చెప్పారు.
ఈ చిత్రంలో ఒక పాటకు తాను రచన, గానం, కొరియోగ్రఫీ వరకు సహకరించడం సంతోషంగా ఉందని ఫరియా పేర్కొన్నారు. నిర్మాతలు షూటింగ్ మొత్తం సపోర్టివ్ గా ఉండటంతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించిందన్నారు. ఆ తర్వాత సినిమాలో విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నానని హీరో నరేష్ అగస్త్య తెలిపారు.
ముఖ్యంగా వృద్ధుడి గెటప్ కోసం చేసిన మేకప్ తనకు మంచి అనుభవమని అన్నారు. దర్శకుడు, నిర్మాతలు షూటింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకున్నారని, అందుకే మంచి అవుట్ పుట్ వచ్చిందని చెప్పారు. కృష్ణ సౌరభ్ సంగీతం, నిరంజన్ రాసిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 19న సినిమా చూసి ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
ఇక సినిమా విషయానికొస్తే.. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాశిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వేను సడ్డి, అమర్ బూరా, జయకాంత్ (బాబీ) నిర్మాతలుగా వ్యవహరించగా, డాక్టర్ సంధ్య గోలి సమర్పించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఆ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.