నాగార్జున అమెరికా బ్యాచిలర్ లైఫ్ ఇలా ఉండేది!
ప్రముఖ టీవీ చానెల్ కార్యక్రమం 'జయమ్ము నిశ్చయమ్మురా'లో నాగ్ అమెరికాలో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఎలా జీవించేవారో బహిర్గతమైంది.;
రజనీకాంత్ 'కూలీ'లో సర్ ప్రైజింగ్ పాత్రలో నటించారు కింగ్ నాగార్జున. ఆయనను తెరపై విలన్ గా చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒప్పించడంతో దీనికి అంగీకరించాడు. సినిమా సంగతులు అటుంచితే, ఇటీవల ప్రచార వేదికలపై నాగార్జున తన వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
ప్రముఖ టీవీ చానెల్ కార్యక్రమం 'జయమ్ము నిశ్చయమ్మురా'లో నాగ్ అమెరికాలో బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఎలా జీవించేవారో బహిర్గతమైంది. హోస్ట్ జగపతిబాబు అతడి గుట్టు మొత్తం బయటపెట్టేసాడు. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన నాగ్ ఇండియాకు వచ్చి, తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు లెగసీని ముందుకు నడిపించేందుకు నటుడయ్యారు. ఆయన ఈరోజు ఎంత పెద్ద సూపర్ స్టార్ అన్నది పరిచయం అవసరం లేదు.
అతడు స్టార్ కాక ముందు, అమెరికాలో ఉన్నప్పుడు నాగార్జున చాలా అల్లరి పనులు చేసేవారట. కానీ ఎంతో కేరింగ్ పర్సన్. తన సోదరిని, తన కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవారు. అమెరికా డేస్ గురించి గుర్తు చేస్తారా? అని జగపతి బాబు నాగార్జునను ప్రశ్నించినా కానీ యుఎస్ లైఫ్ సరిగా గుర్తు లేదు! అన్నట్టుగా నాగ్ ఫేస్ పెట్టారు. కానీ ఆయన అన్న వెంకట్, సోదరి సుశీల మాత్రం అన్ని రహస్యాలను లీక్ చేసారు.
ముందుగా నాగార్జున అన్నగారైన వెంకట్ మాట్లాడుతూ.. వీళ్ల (నాగ్) అపార్ట్ మెంట్ కి వెళితే పిగ్ స్ట్రేలా ఉండేది. అక్కడ చాలా గందరగోళంగా ఉండేవి.. తిన్న ప్లేట్లు కూడా కడిగేవాళ్లు కాదు.. రోజుల తరబడి అలాగే పడి ఉండేవి.. బద్ధకిష్టులు! అంటూ బ్యాచిలర్ లైఫ్ ని ఉన్నదున్నట్టు చెప్పేసరికి నాగ్ కొంత చిన్నబుచ్చుకున్నారు. కానీ సుశీల వచ్చి వారానికోసారి అక్కడ పడి ఉన్న ప్లేట్లు కడిగి బట్టలు ఉతికేసి వెళ్లిపోయేది! అంటూ నాగార్జున స్వయంగా కవర్ చేసేందుకు ట్రై చేసారు.
సోదరుని అసౌకర్యాన్ని కూడా గమనించకుండా, సుశీల ఇంకా అన్ స్టాపబుల్ గా మాట్లాడేస్తూ... తన సోదరుడి రూమ్ లోని బాత్ టబ్ పచ్చగా ఉండేదని చెప్పారు. వారు డైలు డిఫరెంట్ డిఫరెంట్ లోషన్స్ ఉపయోగించేవారు. వాటి వల్ల అలా అయ్యేది. కానీ నేను క్లీన్ చేసి వెళ్లేదానిని.. నిజానికి కట్ లెరీ ఎక్కడ ఉండాలి?.. బేసిన్ లో ఉండేది. ఏదైనా స్పూన్ కావాలంటే బేసిన్ నుంచి తీసి కడుక్కోవాలి.. అంత చెత్తగా పరిశుభ్రత లేకుండా ఉండేవాళ్లు..వాళ్లు వదిలేసినవన్నీ తానే కడగాల్సి వచ్చేది.. అని సోదరుని బ్యాచిలర్ లైఫ్ గురించి వివరించారు సుశీల.
పాపం నాగార్జున దీనికి కొంత చిన్న బుచ్చుకున్నట్టే కనిపించారు. ''ఈయనేమో(జగపతి) పెద్ద హీరో అంటున్నాడు.. మీరేమో అలా చెబుతున్నారు. ఇలాంటి అన్ ఇన్ స్పయిరింగ్ విషయాలు చెప్పి నన్ను దింపేద్దామనా..! ఇక్కడ కూచోబెట్టారు?'' అంటూ సరదాగా నవ్వేసారు నాగార్జున.
దానిని హోస్ట్ జగపతి తనదైన శైలిలో కవర్ చేసారు. ఈ ప్రోగ్రామే జయమ్ము నిశ్చయమ్మురా... ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా విజయం సాధించారనేదే.. మేం చెప్పదలిచాం! అని ప్రోగ్రామ్ థీమ్ గురించి చెప్పారు.
ఇదే షోలో ఫ్యామిలీ విషయంలో నాగార్జున కేరింగ్ ఎలా ఉంటుందో సుశీల చెప్పుకొచ్చారు. ఒకసారి బయటకు వెళుతుంటే మంచు విపరీతంగా పడింది. దారి నిండా గడ్డలు కట్టి ఉంది. నేను చీరలో నడవలేని పరిస్థితి.. నన్ను ఎత్తుకుని తీసుకెళ్లి కార్‌లో కూచోబెట్టాడు. అది ఎంతో ఎమోషనల్ కనెక్టివిటీ. ఇప్పటికీ మర్చిపోలేను.. అని తెలిపింది.
నిజానికి ఈ షోలో హోస్ట్ జగపతి బాబు ఎంత అడుగుతున్నా అమెరికాలో ఏ విషయాలు సరిగా గుర్తు లేవని అన్నాడు. కేవలం తనకు మాత్రమే తెలిసిన విషయాలను నాగార్జున అసలు చెప్పనే లేదు. ''నేను చెప్పను!'' అంటూ సరదాగా ఆటపట్టించారు అందరినీ.