నాన్న‌కి ఫోన్ చేసి ఒక్క మాట చెబితే చాలు!

అక్కినేని నాగార్జున త‌న‌యులుగా నాగ‌చైత‌న్య‌, అఖిల్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-03 23:30 GMT

అక్కినేని నాగార్జున త‌న‌యులుగా నాగ‌చైత‌న్య‌, అఖిల్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అక్కినేని న‌ట వారస‌త్వాన్ని దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నారు. నాగ చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో విజ‌యాలు చూసాడు. అఖిల్ ఇప్పుడిప్పుడే ఫాంలో కి వ‌స్తున్నాడు. అయితే వీరిద్ద‌రు ఎక్కువ‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే ప‌ని చేస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌తో ఇంత వ‌ర‌కూ సినిమాలు చేయ‌లేదు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్లతో చైత‌న్య‌, అఖిల్ ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు. ఇద్ద‌రు అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన తార‌లు.

స్టార్ డైరెక్ట‌ర్ల‌తో వాళ్ల‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఏంటి? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. తాజాగా ఈ సందేహాల‌న్నింటినీ నాగ‌చైత‌న్య నివృతి చేసాడు. ఫ‌లానా డైరెక్ట‌ర్ తో ప‌ని చేయాల‌ని ఉంద‌ని నాన్న‌ని అడిగితే నా ముందుకు తీసుకొచ్చి పెట్ట‌గ‌ల‌రు. అందుకోసం ఎంతైనా అడ్వాన్స్ ఇవ్వ‌గ‌ల‌రు. స్టూడియో నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. నేను ప‌ని చేయాల‌నుకున్న ద‌ర్శ‌కులు వ‌స్తారు. ఇలాంటి అవ‌కాశం నాన్న నాగార్జున నాకు చాలా సార్లు ఇచ్చారు.

`ఏరా ఎవ‌రికైనా చెప్పేదా`? అని చాలాసార్లు అడిగారు. ఎవ‌రికైనా అడ్వాన్స్ పంపిద్దామ‌ని అడిగిన సంద‌ర్భాలెన్నో. డైరెక్ట‌ర్ ని సెట్ చేయ‌డం నాన్న‌కి ఎంతో సేపు ప‌ని కాదు. డైరెక్ట్ గా న‌న్ను తీసుకెళ్లి మాట్లాడుతారు. అందుకు నాన్న ఎప్పుడూ నో అన‌రు. ఏ డైరెక్ట‌ర్ కావాల‌ని ఎన్నోసార్లు అడిగారు. ఈ విష‌యంలో నాన్న‌ను ఎంత మాత్రం త‌ప్పుగా అనుకోకూడ‌దు. ఎక్క‌డో లోప‌ల మేము స్వ‌తంత్రంగా ఎద‌గాల‌నే అనుకున్నాం. కుటుంబం స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎక్కువ‌గా వారి మీద ఆధార ప‌డ‌కూడదు అన్న‌దే మా ఆలోచ‌న‌. న‌టుడిగా ఎంట్రీ వ‌ర‌కూ నాన్న స‌హ‌కారంతోనే వ‌చ్చాం. ఇంకా ఆయ‌న మీద ఆధార‌ప‌డితే? ప‌రిశ్ర‌మ‌లో నేను సాధించేది ఏముంటుంది? అని అన్నారు.

ప్ర‌స్తుతం నాగ చైత‌న్య హీరోగా కార్తీక్ దండు ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమా చేయ‌డం ఇదే తొలిసారి. ఓ గుహ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. నాగ చైత‌న్య కెరీర్లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం కూడా ఇదే. పాన్ ఇండియాలో ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే చైత‌న్య గ‌త సినిమా `తండేల్` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చైత‌న్య ను వంద కోట్ల క్ల‌బ్ లో చేర్చిన తొలి చిత్ర‌మిదే.

Tags:    

Similar News