విజయ్ 'కొత్త' మూవీ.. మళ్లీ 'తెలుగు' బాధ్యతలు ఆయనకేనా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చివరి సినిమా అదేనని తెలుస్తోంది.;
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు జన నాయగన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చివరి సినిమా అదేనని తెలుస్తోంది. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2026 జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేయనున్నారు.
అయితే జన నాయగన్ తెలుగులో కూడా విడుదల అవ్వనుంది. అందుకు గాను మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రస్తుతం జరుపుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో తెలుగు థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన ఓ వార్త.. ఇప్పుడు అటు సోషల్ మీడియాలో.. ఇటు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
జన నాయగన్ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ విషయంపై మేకర్స్, నాగవంశీ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని వినికిడి. పెద్ద ఎత్తున సినిమాను నాగవంశీ విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే విజయ్ గతంలో నటించిన లియో మూవీని నాగవంశీని తెలుగులో విడుదల చేశారు. 2023 అక్టోబర్ లో విడుదలైన ఆ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించింది. విజయ్ కెరీర్ లోనే తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని మోస్తరు లాభాలు వచ్చాయని అప్పట్లో టాక్ వచ్చింది.
అలా అప్పుడు లియో మూవీని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసిన నాగవంశీ.. ఇప్పుడు జననాయగన్ ను కూడా విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి అదే నిజమైతే.. నాగవంశీ ఎన్ని కోట్లకు థియేట్రికల్ హక్కులు సంపాదించుకుంటారో.. ఎంత లాభాలు అందుకుంటారో వేచి చూడాలి.