పరభాష సినిమాలపై మన ఆడియన్స్ తీర్పు.. నాగవంశీ మాటల్లో నిజమెంత?

ఈ చర్చలో మరో ముఖ్యమైన కోణం కూడా బయటకొచ్చింది. అదే ప్రేక్షకుల సమయం, డబ్బు విలువ. "ఏ సినిమా చూడాలో, ఎలా చూడాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా?;

Update: 2025-10-21 16:29 GMT

"మన తెలుగు ఆడియన్స్ తీరే వేరు.. వాళ్లకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో చెప్పడం కష్టం!" ఈ మాట తరచూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే, ఈసారి ఆ మాట అన్నది ఎవరో కాదు, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై, ముఖ్యంగా ఇతర భాషా చిత్రాలతో పోల్చినప్పుడు మన సినిమాలపై చూపే వైఖరిపై ఆయన చేసిన కామెంట్స్, భిన్నాభిప్రాయాలకు తావిస్తున్నాయి.

నిజానికి, ఇలాంటి అభిప్రాయాన్ని గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తం చేశారు. 'దేవర' ప్రమోషన్ల సమయంలో మాట్లాడుతూ, "ఈ మధ్య కొందరికి సినిమా ఎలా చూడాలో తెలియడం లేదు, ప్రతీ దాంట్లో ఏదో ఒకటి తూకం వేసి వెతకడమే పనిగా పెట్టుకున్నారు.. ఇన్నోసెంట్ గా సినిమాను ఎందుకు చూడలేకపోతున్నారు" అని అన్నారు. ఇప్పుడు నాగవంశీ కూడా దాదాపు అదే పాయింట్‌ను మరింత ఘాటుగా చెప్పారు.

"ఇదే 'లోకా' సినిమాను స్ట్రెయిట్ తెలుగులో తీస్తే, ల్యాగ్ ఉంది, స్పాన్ లేదు అంటూ తిట్టేవారు. అదే మలయాళం సినిమా కాబట్టి ఓకే అంటున్నారు. ఆ సినిమాను నేనే తెలుగులో రిలీజ్ చేశాను" అని అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నాగవంశీ చెప్పింది అక్షరాలా నిజమని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. "మనవాళ్లు తీస్తే రొటీన్ అంటారు, అదే వేరే వాళ్లు తీస్తే క్లాసిక్ అంటారు" అంటూ ఆయన వాదనకు బలం చేకూరుస్తున్నారు.

ఒకే తరహా కంటెంట్‌కు, వేర్వేరు భాషల సినిమాలకు ప్రేక్షకులు వేర్వేరుగా స్పందిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.అయితే, మరో వర్గం నెటిజన్లు మాత్రం ఈ వాదనపై మరో విధంగా స్పందిస్తున్నారు. ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, భాష, బడ్జెట్, స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారని వారు బలంగా వాదిస్తున్నారు. 'బలగం', 'మసూద' లాంటి చిన్న సినిమాలు, పెద్ద స్టార్లు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడాన్ని వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. కంటెంట్‌లో దమ్ముంటే, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని వారు అంటున్నారు.

ఈ చర్చలో మరో ముఖ్యమైన కోణం కూడా బయటకొచ్చింది. అదే ప్రేక్షకుల సమయం, డబ్బు విలువ. "ఏ సినిమా చూడాలో, ఎలా చూడాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? మా టైమ్, మనీ వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది" అని మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. రివ్యూలు, టాక్‌తో సంబంధం లేకుండా, తమకు నచ్చిన సినిమాలను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు.

మొత్తం మీద, నాగవంశీ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఒక కొత్త, చర్చకు తెరలేపాయి. మాటల్లో కొంత నిజం ఉందంటూ కొందరు సమర్థిస్తుంటే, ప్రేక్షకుల విచక్షణను తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు వాదిస్తున్నారు.

Tags:    

Similar News