రవితేజ నుంచి ఆశించేవన్నీ సిద్ధంగా ఉన్నాయి: నాగవంశీ
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ``వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ గారి సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్ కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి.;
మాస్ మహారాజా రవితేజ - శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర ఈ నెల 31న ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్రబృందం పాల్గొంది.
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ``వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ గారి సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్ కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమాల కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది. ఈ వేడుకకు విచ్చేసిన హీరో సూర్య గారికి ధన్యవాదాలు`` అన్నారు.
దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. ``రవితేజ గారి అభిమానులకు నా కృతఙ్ఞతలు. నేనూ మీలో ఒకడినే. మీ నుండే ఇక్కడికి వచ్చాను. సూర్య గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. రవితేజ గారు దర్శకులను పరిచయం చేసే ఒక యూనివర్సిటీ నెలకొల్పారు. ఆ యూనివర్సిటీలో సీట్ ఇచ్చిన రవితేజ గారికి ధన్యవాదాలు. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతానని ఆశిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత నా కథ. ఆ కథ నచ్చి రవితేజ గారు నాకు అవకాశమిచ్చారు. నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలో మొదటి సినిమా చేసే అవకాశం వచ్చేలా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి నేను అభిమానిని. ఇందులో ఆయన పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల గారు పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర గారి పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా అయినప్పటికీ, భీమ్స్ గారు ఎంతో అండగా నిలిచారు. అద్భుతమైన సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇచ్చిన మద్దతుని ఎప్పటికీ మరిచిపోలేను. నా దృష్టిలో నాగవంశీ కంటే గొప్ప క్రిటిక్ లేరు. ఆయనకు సినిమా నచ్చిందంటే అది హిట్టే. వంశీ గారు ఈ సినిమా చూసి చాలా బాగుంది అన్నారు. అక్టోబర్ 31 కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. ``ధమాకా తర్వాత చిరంజీవి గారి సినిమాకి పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాను. నా ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక మానసిక స్థైర్యం ఒకరున్నారు. ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, ఎలా బ్రతకాలి, రేపు ఎలా గడపాలి? అనే సందేహంలో నేను, నా కుటుంబం ఉన్న సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి అవకాశం వచ్చింది. అదే ధమాకా. ఆ సమయంలో నా వెనుక ఓ దేవుడిలా నిలబడిన ఆ వ్యక్తి పేరు, ఆ శక్తి పేరు రవితేజ గారు. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి ఉన్నానంటే దానికి కారణం రవితేజ గారు. అందుకే, ఆయనపై నాకున్న ప్రేమను పాటల రూపంలో చూపిస్తుంటాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు`` అన్నారు.
ఈ వేడుకలో దర్శకులు శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న, కళా దర్శకుడు శ్రీ నాగేంద్ర తంగాల తదితరులు పాల్గొని ‘మాస్ జాతర’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.