క‌పుల్ బ్రాండింగ్‌లో చై- శోభిత జోరు

అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జోడీ టాలీవుడ్‌లోనే కాకుండా సౌతిండియాలో అత్యంత క్రేజీ కపుల్‌గా గుర్తింపు పొందుతున్నారు.;

Update: 2026-05-06 18:13 GMT

అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జోడీ టాలీవుడ్‌లోనే కాకుండా సౌతిండియాలో అత్యంత క్రేజీ కపుల్‌గా గుర్తింపు పొందుతున్నారు. ఇటీవల ప్ర‌ఖ్యాత బ్రాండ్ `ఆప్‌ట్రానిక్స్` ఆసియాలోనే అతిపెద్ద స్టోర్ ప్రారంభోత్సవంలో ఈ జంట కలిసి సందడి చేయడంతో వీరి `బ్రాండ్ వ్యాల్యూ`పై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వీరిద్దరి కలయిక కేవలం వ్యక్తిగత జీవితానికే కాకుండా.. వాణిజ్య ప్రకటనల ప్రపంచంలో కూడా ఒక కొత్త ప‌వ‌ర్‌ని జోడించింద‌ని అర్థ‌మ‌వుతోంది.




ఈ జంటకు ఉన్న పాన్-ఇండియా అప్పీల్ కారణంగా ప్రముఖ బ్రాండ్లు వీరి వైపు మొగ్గు చూపుతున్నాయి. నాగచైతన్యకు ఉన్న క్లాస్ అండ్ డీసెంట్ ఇమేజ్.. శోభితకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఫ్యాషన్ క్వీన్ ఇమేజ్ కార‌ణంగా ఈ జంటకు డిమాండ్ భారీగా పెరిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ జోడీ కలిసి ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం సుమారు రూ.1.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రాండ్ స్థాయిని బట్టి ప్యాకేజీ మరింత పెరిగే అవకాశం ఉంది.

నాగచైతన్య వ్యక్తిగత బ్రాండ్ వ్యాల్యూ విషయానికి వస్తే.. అత‌డు తన ఇమేజ్‌కు తగిన బ్రాండ్లను మాత్రమే ఎంచుకుంటారు. ప్రస్తుతం ఒక్కో ఎండార్స్‌మెంట్ కోసం చైతన్య 1 కోటి నుండి 2 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఆర్‌ఎస్ బ్రదర్స్, మింత్రా వంటి పాపులర్ బ్రాండ్లతో పాటు గ్రిన్కో .. పలు లగ్జరీ వాచ్ బ్రాండ్లకు ఈ యువ‌హీరో ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా కేవలం అడ్వర్‌టైజ్మెంట్స్ ద్వారానే చైతూ ఏడాదికి 5 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు ట్రేడ్ అంచనా.

మరోవైపు శోభిత ధూళిపాళ నటిగానే కాకుండా మోడలింగ్ ప్రపంచంలో గ్లోబల్ బ్రాండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. లూయిస్ విట్టన్, ఎస్టీ లాడర్ వంటి అంతర్జాతీయ స్థాయి బ్యూటీ ఉత్ప‌త్తులు- ఫ్యాషన్ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్కో ప్రమోషన్ కోసం 50 లక్షల నుండి 75 లక్షల వరకు తీసుకుంటున్న శోభిత బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి సుమారు 3 నుండి 4 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నార‌ని అంచ‌నా. ఓటీటీ.. మోడలింగ్ రంగాల్లో త‌న‌కు ఉన్న క్రేజ్ ఇప్పుడు అక్కినేని బ్రాండ్‌కు అదనపు బలాన్నిస్తోంది.

దక్షిణాదిలో నాగచైతన్యకు ఉన్న బలమైన ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ .. శోభితకు ఉత్తరాదితో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు ఇప్పుడు వీరిద్దరినీ ప్రీమియం బ్రాండ్లకు ఫేవరెట్‌గా మార్చేశాయి. ఆపిల్ రీసెల్లర్ వంటి దిగ్గజ సంస్థలు ఈ జంట‌ను ప్ర‌చారం కోసం ఎంచుకోవడమే దీనికి నిదర్శనం. విడివిడిగా చేసే ప్రమోషన్ల కంటే `కపుల్ బ్రాండింగ్` ద్వారా ఈ అంద‌మైన జంట బాగా ఆర్జిస్తోంది. త‌మ‌ మార్కెట్ వ్యాల్యూ మునుముందు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.



Tags:    

Similar News