చైతూ సూపర్ ప్లాన్.. సరిగ్గా సెట్ అయితే..
నాగచైతన్య ఇప్పటికే డిజిటల్ వరల్డ్ లోకి దూత వెబ్ సిరీస్ తో అడుగుపెట్టారు. దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన ఆ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఒకప్పుడు ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఎక్కువగా కనిపించిన యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య.. ఇప్పుడు తన కెరీర్ లో కొత్త దారిని ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హారర్, సూపర్ నేచురల్, మిథికల్ థ్రిల్లర్ కథలపై వరుసగా ఇంట్రెస్ట్ చూపడం చర్చకు దారితీస్తోంది. ఆ జోనర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని చైతూ వేస్తున్న అడుగులు సరిగ్గా పడితే ఆయన కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాగచైతన్య ఇప్పటికే డిజిటల్ వరల్డ్ లోకి దూత వెబ్ సిరీస్ తో అడుగుపెట్టారు. దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన ఆ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫ్యూచర్ ను సూచించే పేపర్ క్లిప్పింగ్స్ చుట్టూ సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సిరీస్ విజయంతో ఇప్పుడు రెండో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా, త్వరలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి చైతూ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ బాధ్యతలు చేపట్టనున్నారు.
అదే సమయంలో ఆయన వృషకర్మ అనే కొత్త ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్షతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తిస్థాయి హారర్ సినిమా కాకపోయినా.. హారర్, అడ్వెంచర్, మిథికల్ థ్రిల్లర్ అంశాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఆ జోనర్ లో కొత్త అనుభూతిని అందించే ప్రయత్నంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు మసూద చిత్రంతో హారర్ జోనర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి కిరణ్ తో నాగచైతన్య సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సాయి కిరణ్ సిద్ధం చేస్తున్న కొత్త హారర్ కథను చైతూకు వినిపించినట్లు సమాచారం. ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా.. ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాగచైతన్య కెరీర్‌లో ఇదే తొలి పూర్తి స్థాయి హారర్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో హారర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కథ స్ట్రాంగ్ గా ఉండి, టెక్నికల్ గా ఆకట్టుకునేలా తెరకెక్కిస్తే చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు సాధిస్తున్నాయి. అందుకే పలువురు హీరోలు ఆ జోనర్ పై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే దారిలో అడుగులు వేయడం విశేషం. అయితే హారర్ జోనర్ లో హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. కొత్త కథ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, భయపెట్టే అంశాలతో పాటు ఎమోషన్స్ కూడా ప్యారలెల్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఆ విషయాల్లో చైతూ సెలెక్షన్స్ సరైన దిశలో ఉంటే ఆయనకు మంచి ఫలితాలు అందించే అవకాశం ఉంది. అయితే వరుసగా హారర్, మిథికల్ థ్రిల్లర్ కథలను ఎంచుకోవడం ద్వారా నాగచైతన్య తన కెరీర్ లో భిన్నమైన గుర్తింపు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టులు అంచనాలకు తగ్గట్టుగా రూపుదిద్దుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. హారర్ జోనర్ లోనూ చైతూ సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచే అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి.