పూరి ఇంత సమయం తీసుకుంటున్నాడేంటి?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గాడిన పడ్డట్లే అని అంతా అనుకున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గాడిన పడ్డట్లే అని అంతా అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. లైగర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని డబుల్ ఇస్మార్ట్ మూవీని తీసుకు వచ్చాడు. ఆ సినిమా సైతం తీవ్రంగా నిరాశ పరిచింది. హిట్ కాంబో అయినా హిట్ రిపీట్ కాలేదు. దాంతో పూరితో సినిమా అంటే దాదాపు అందరు హీరోలు కాస్త ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో దాదాపు ఏడాది పాటు పూరి జగన్నాథ్ తన కొత్త సినిమా కోసం కథ పట్టుకుని వెయిట్ చేశాడు అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తమిళ్ హీరో విజయ్ సేతుపతి కథ నచ్చి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ వీరి కాంబో మూవీ గత ఏడాది జులై లో ప్రారంభం అయింది.
స్లమ్‌డాగ్ : 33 టెంపుల్ రోడ్ మూవీ...
సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేస్తాడు. కాస్త ఆలస్యం అయినా, అటు ఇటుగా ఆరు నెలల్లో తన సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తాడు. కానీ విజయ్ సేతుపతితో పూరి తీస్తున్న 'స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్' మూవీ మాత్రం ఏడాది దాటినా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది చివర్లోనే సినిమా షూటింగ్ పూర్తి కాబోతుందనే వార్తలు వచ్చాయి. పూరి టీం మెంబర్స్ సైతం సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కొత్త ఏడాది వచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు స్లమ్‌డాగ్ సినిమా విడుదలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో అసలు పూరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నాడు? ఎందుకు సినిమా ఆలస్యం అవుతుందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
విజయ్ సేతుపతి హీరోగా తెలుగు సినిమా...
విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాట ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి బిజినెస్ చేస్తుందని కూడా అంతా భావిస్తున్నారు. ఇక పూరి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మంచి ఫైనాన్షియర్స్ దొరికారు అని, తప్పకుండా సినిమా త్వరగా పూర్తి అవుతుందని యూనిట్ సభ్యులు అనుకున్నారు. కానీ పూరి గత చిత్రాల ఫలితాల కారణంగా, ఆ సినిమాల విడుదల సమయంలో ఉన్న ఇబ్బందుల కారణంగా స్లమ్‌డాగ్ సినిమా విడుదల పై ప్రభావం పడింది. పూరి నిర్మాణంలో రాబోతున్న సినిమా కావడంతో గత చిత్రాలకు సంబంధించిన నష్టాలను పూడ్చాల్సిందే అని, ఆ లెక్కలన్నీ తేల్చాల్సిందే అంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారట. ఆ కారణంతో సినిమా ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా...
పూరి సినిమా మేకింగ్‌కు గతంలో ఎప్పుడు లేనంతగా ఎక్కువ సమయం స్లమ్ డాగ్ సినిమాకు తీసుకున్న మాట వాస్తవం. అయితే సినిమా విడుదలకు మాత్రం ఆర్థిక ఇబ్బందులు కారణం అయ్యి ఉంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఇరు వర్గాల వారు మాట్లాడుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్లమ్ డాగ్ సినిమాతో పూరి జగన్నాథ్ కచ్చితంగా తన పూర్వ వైభవం దక్కించుకుంటాడనే విశ్వాసం అందరిలోనూ ఉంది. ఆయన దర్శకుడిగా ఒకప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. సినిమాల మేకింగ్ విషయంలో, కథల ఎంపిక విషయంలో, సినిమాలను విడుదల చేసేందుకు ప్లానింగ్ విషయంలోనూ పూరి జగన్నాథ్ చాలా ప్రత్యేకమైన శైలితో వ్యవహరించేవాడు. అందుకే ఆయన నుంచి ఎంతో మంది సీనియర్ దర్శకులు సైతం నేర్చుకుంటున్నాం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. దర్శకుడిగా పూరి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.