ఎన్టీఆర్‌ 'గాడ్‌ ఆఫ్‌ వార్‌' షూటింగ్‌ ఎప్పుడు?

ఈ సినిమాకు అభిమానులు 'గాడ్‌ ఆఫ్‌ వార్‌' అనే టైటిల్‌గా చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ అండ్‌ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Update: 2026-07-11 10:30 GMT

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'అరవింద సమేత' సినిమాను చేసిన విషయం తెల్సిందే. 2018లో ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌లోని సరికొత్త యాంగిల్‌ను అరవింద సమేత సినిమా చూపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్‌ బాగా తెలిసిన త్రివిక్రమ్‌ మరో సినిమాను చేయాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటూ వస్తున్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఒక భారీ సబ్జెక్ట్‌తో వీరు రాబోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుబ్రమణ్య స్వామి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు ఇప్పటికే చెప్పకనే చెప్పారు.

ఎన్టీఆర్‌ 'గాడ్‌ ఆఫ్‌ వార్‌' మూవీ...

ఈ సినిమాకు అభిమానులు 'గాడ్‌ ఆఫ్‌ వార్‌' అనే టైటిల్‌గా చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ అండ్‌ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం ఈ సినిమా సుబ్రమణ్యస్వామి బ్యాక్‌డ్రాప్‌ అనగానే ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ ప్రస్తుతం వెంకటేష్‌తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్‌తో సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరో మూడు నెలల్లో డ్రాగన్‌ పూర్తి కావచ్చని సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌...

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ ఇద్దరూ వేరు వేరు సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ప్రస్తుతానికి గాడ్‌ ఆఫ్‌ వార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాదని తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ అండ్‌ టీం మెంబర్స్‌ స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు, సెట్టింగ్స్‌ కు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా కూడా ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఎన్టీఆర్‌ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ కాలం నేపథ్యంలో సాగుతుంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ దర్శకుడు త్రివిక్రమ్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ తన రూట్‌ను పూర్తిగా విడిచి మరీ ఈ సినిమాను తీస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ 'డ్రాగన్‌' మూవీ...

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్‌ సినిమా కోసం ఎన్టీఆర్‌ బరువు తగ్గి, సన్నబడ్డ విషయం తెల్సిందే. అయితే త్రివిక్రమ్‌ మూవీ కోసం అదే లుక్‌ ను కంటిన్యూ చేస్తాడా లేదంటే కాస్త ఏమైనా బరువు పెరుగుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఇవ్వలేదు. కానీ సినిమా గురించి సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబో మూవీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీగా బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే హాసిని అండ్‌ హారిక, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ సైతం భాగస్వామ్యులుగా ఉంటారని టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ కు పౌరాణిక పాత్రలు బాగా సెట్‌ అవుతాయి. కనుక ఈ సినిమా మరో రేంజ్‌లో ఉండటం ఖాయం అని, మరో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రేంజ్‌ హిట్‌ ను ఎన్టీఆర్‌ అందుకోబోతున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News