క్రీడా ప్రపంచంలోకి టాలీవుడ్ నిర్మాణ సంస్థ
వినోద రంగంలో సంచలనాలు సృష్టించిన మైత్రి మూవీ మేకర్స్ ఇకపై క్రికెట్ ప్రపంచంలోను తమ హవా సాగించేందుకు ప్రయత్నిస్తోంది.;
వినోద రంగంలో సంచలనాలు సృష్టించిన మైత్రి మూవీ మేకర్స్ ఇకపై క్రికెట్ ప్రపంచంలోను తమ హవా సాగించేందుకు ప్రయత్నిస్తోంది. ముందుగా క్రీడా ప్రపంచంలో లోతు పాతుల్ని తెలుసుకునేందుకు, క్రికెట్ క్రీడతో అనుబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టేందుకు సంసిద్ధమవుతోందని సమాచారం.
తాజాగా సన్ ఇంటర్నేషనల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 కోసం మైత్రి తమ సొంత టీమ్ `విజయవాడ సన్ షైనర్స్`ను ప్రారంభించింది. ఈ టీమ్‌ను యెర్నేని నవీన్, వై రవిశంకర్, శ్రీకాంత్ జాస్తి సంయుక్తంగా నిర్వహించనున్నారు. టోర్నీ వివరాల్లోకి వెళితే.. ఎపిఎల్ 2025 ఆగస్టు 8 నుండి ఆగస్టు 24 వరకు జరగనుంది. ఇందులో ఐపీఎల్ తరహాలోనే వర్థమాన క్రికెటర్లు తమ ప్రతిభను ఆవిష్కరించుకునేందుకు పొట్టి ఫార్మాట్ క్రికెట్ ఆడతారని సమాచారం. ఈ టోర్నీలో కొత్త ప్రతిభావంతులను కనుగొనేందుకు అవకాశం ఉంది.
పాన్ ఇండియా సినిమాలతో సంచలనాలు సృష్టించడమే కాదు.. క్రీడాభిరుచితో ఇప్పుడు క్రికెట్ లో అడుగుపెట్టడం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ పేరు దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద స్థాయిలో మార్మోగనుంది. కింగ్ ఖాన్ షారూఖ్, జూహీ చావ్లా, ప్రీతి జింతా సహా పలువురు అగ్ర తారలు ఐపీఎల్ టీమ్ లను కొనుగోలు చేసి బోలెడంత సందడి చేస్తున్నారు. తెలుగు చిత్రసీమ నుంచి పలువురు క్రీడా రంగంలో అడుగుపెడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ క్రికెట్ లో వ్యూహాత్మకంగా అడుగు పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.