దండోరా.. బలగం పోలికపై దర్శకుడు ఏమన్నారంటే?

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో మాట్లాడుతూ సినిమా వెనుక ఉన్న కథ, కష్టసుఖాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.;

Update: 2025-12-15 17:38 GMT

కలర్ ఫోటో, బెదురులంక 2012 వంటి వైవిధ్యమైన సినిమాలను అందించిన నిర్మాత రవీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన లేటెస్ట్ సినిమా 'దండోరా'. శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో మాట్లాడుతూ సినిమా వెనుక ఉన్న కథ, కష్టసుఖాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాన్ని దర్శకుడు వివరిస్తూ.. మెదక్ జిల్లాకు చెందిన తాను అమెరికాలో జాబ్ చేసేవాడినని, కానీ అక్కడి రొటీన్ లైఫ్ బోర్ కొట్టి సినిమాల మీద ఉన్న ఇష్టంతో రిస్క్ చేసి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. తనకు ప్రేమకథల కంటే సమాజంలోని మూలాల్లో ఉన్న సమస్యల మీద కథలు చెప్పడమే ఇష్టమని, అందుకే సమాజంలో ఉన్న అసమానతల ఆధారంగా, మలయాళం సినిమాల తరహాలో ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ దండోరా కథను రాసుకున్నానని ఆయన తెలియజేశారు.

చనిపోయిన మనిషి చుట్టూ తిరిగే కథ కావడంతో అందరూ బలగం సినిమాతో పోలుస్తున్నారని, కానీ దానికి దీనికి అస్సలు సంబంధం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. బలగం అనేది పిండాల చుట్టూ తిరిగే ఎమోషన్ అయితే, దండోరా మాత్రం మనిషి చనిపోయాక ఆ బాడీని పూడ్చడానికి జాగా దొరక్కపోవడం, అక్కడ జరిగే వివక్ష చుట్టూ తిరుగుతుందని వివరించారు. క్రిమేషన్ తోనే సినిమా ముగుస్తుందని, ప్రభుత్వాలు వైకుంఠధామాలు కట్టించినా ఇంకా వివక్ష కొనసాగుతోందనే పాయింట్ ను టచ్ చేశామని అన్నారు.

నటీనటుల గురించి మాట్లాడుతూ.. ఇందులో ప్రతి పాత్ర శివాజీ గారి క్యారెక్టర్ కు లింక్ అయి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా బిందు మాధవి గారి పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా, స్ట్రాంగ్ గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. కీలకమైన నిర్ణయాలన్నీ ఆడవాళ్లే తీసుకుంటారని, మహిళా పాత్రలకు అంత ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా మేకింగ్ గురించి చెబుతూ.. తాను కొత్తవాడిని కావడంతో తక్కువ బడ్జెట్ అనుకున్నానని, కానీ నిర్మాత రవీంద్ర గారు క్వాలిటీ కోసం భారీగా ఖర్చు పెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. మొదట ఈ సినిమాకు 'అంతిమ యాత్ర' అనే టైటిల్ అనుకున్నా, అది డల్ గా ఉందని ఫ్రెండ్ సలహాతో 'దండోరా' అని మార్చామని, ఆ టైటిల్ కథకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని వివరణ ఇచ్చారు.

చివరగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చో చెబుతూ మార్క్ కె రాబిన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఏదో ఊహించుకుంటారని, కానీ థియేటర్లో అంతకు మించిన సర్ ప్రైజ్ లు ఉంటాయని, కచ్చితంగా ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారని దర్శకుడు మురళీకాంత్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News