రాజమౌళి ఫ్యామిలీతో పెళ్లి సంబంధం.. అందుకే ఓకే చెప్పాం: మురళీమోహన్

ఇప్పుడు తమ కన్నా వాళ్లతో ఎక్కువగా ఉంటుంది మనవరాలని నవ్వుతూ అన్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అయినా వాళ్ల ఫ్యామిలీ ఎక్కడా పోజులు ఇవ్వరని చెప్పారు.;

Update: 2025-12-19 07:35 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్, దర్శకధీరుడు రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఈ మధ్య బంధువులుగా మారిన విషయం తెలిసిందే. మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కొన్ని రోజుల క్రితం వియ్యం అందుకున్నారు. రామ్మోహన్ కుమార్తె రాగకు కీరవాణి కుమారుడు శ్రీసింహతో పెళ్లి జరిపించారు.

శ్రీ సింహ, రాగ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు.. అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వివాహ సమయంలో రాగ కూర్చున్న పల్లకిని కాలభైరవ (కీరవాణి పెద్ద కుమారుడు)తో పాటు మిగిలిన వాళ్లంతా మోయడం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే ఇప్పుడు తన మనవరాలి పెళ్లిపై మురళీ మోహన్ మాట్లాడారు. రాగ, శ్రీ సింహది ప్రేమ వివాహామని చెప్పారు. వారిద్దరే ఒకటి కావాలనుకున్నారని, ముందే కలుసుకున్నారని తెలిపారు. తమకు విషయం చెప్పగా ఓకే చెప్పామని, పెళ్లి చేశామని తెలిపారు. ప్రేమ పెళ్లి అయినా తాము అందుకు ఎక్కడా నో చెప్పలేదని అన్నారు.

ఎందుకంటే శ్రీ సింహది చాలా మంచి ఫ్యామిలీ అని, వాళ్ల కుటుంబం కోసం ఇండస్ట్రీ అంతా మంచిగా చెబుతుంటారని అన్నారు. వాళ్ల కుటుంబంలో అంతా ఫ్రెండ్లీగా, ఆప్యాయంగా ఉంటారని చెప్పారు. అంతా కలిసి ఆడుకుంటారు.. కలిసి తిరుగుతుంటారు.. తాము కూడా వాళ్ళతో ఇప్పుడు కలిసిపోయామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పుడు తమ కన్నా వాళ్లతో ఎక్కువగా ఉంటుంది మనవరాలని నవ్వుతూ అన్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అయినా వాళ్ల ఫ్యామిలీ ఎక్కడా పోజులు ఇవ్వరని చెప్పారు. చాలా సింపుల్ గా ఉంటారని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారని జక్కన్న ఫ్యామిలీ కోసం గొప్పగా చెప్పుకొచ్చారు మురళీ మోహన్. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు. రాగ, శ్రీసింహ పెళ్లి వేడుకల్లో రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యుల చొరవ చూసి తనకు ఎంతో ముచ్చట వేసిందని అన్నారు. అక్కడికి వచ్చిన వారందరికీ ఎవరు ఆడపిల్ల తరఫు, ఎవరు మగపిల్లాడి తరఫున అనేది అర్థం కాలేదని తెలిపారు.

అలా సందడి చేశారని గుర్తు చేసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా తమను అంతా అక్కడ చూసుకున్నారని చెప్పారు. మనవరాలి పెళ్లి విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని మురళీ మోహన్‌ తెలిపారు. ఇక మరోవైపు శ్రీసింహా వరుస సినిమాలతో హీరోగా బిజీ అవుతున్నాడు ఆ మధ్య మత్తు వదలరా 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News