'మున్నాభాయ్ MBBS' పార్ట్ 3 ఎట్ట‌కేల‌కు!

మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా ఎప్ప‌టికి వ‌స్తుంది? ఈ ప్ర‌శ్న‌కు స‌రైన జ‌వాబు కోసం అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు.;

Update: 2025-10-25 04:17 GMT

మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమా ఎప్ప‌టికి వ‌స్తుంది? ఈ ప్ర‌శ్న‌కు స‌రైన జ‌వాబు కోసం అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ట్యాలెంటెడ్ రాజ్ కుమార్ హిరాణీ నుంచి మున్నాభాయ్ ఎంబిబిఎస్ 3 వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశ‌గా ఎదురు చూస్తున్నా, అది ఎందుక‌నో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. అయితే మూడో భాగం విష‌యంలో హిరాణీ ప్ర‌స్తుతం సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్నార‌ని తెలిసింది.

మొదటి రెండు చిత్రాలు - మున్నా భాయ్ ఎంబిబిఎస్‌ (2003) , లగే రహో మున్నా భాయ్ (2006) భార‌తీయ సినిమా హిస్ట‌రీలో క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. బాలీవుడ్ లో మునుపెన్న‌డూ లేని అద్భుత‌మైన‌ కామెడీ, భావోద్వేగాలు, సామాజిక అంశాల‌తో ఈ చిత్రాలు చాలా ప్ర‌త్యేకంగా నిలిచాయి. అందుకే సంవత్సరాలుగా అభిమానులు పార్ట్ 3 కోసం వేచి ఉన్నారు. మున్నా భాయ్ 3 గురించి ఇటీవ‌ల‌ పుకార్లు పదే పదే వినిపిస్తూనే ఉన్నాయి. `మున్నా భాయ్ చలే అమెరికా` టీజర్ కూడా 2007లో విడుదలైంది. అయితే స్క్రిప్ట్ ఆశించినంత బాగా రాలేద‌ని భావించిన భ‌న్సాలీ దానిని మ‌ధ్య‌లోనే వ‌దిలేసారు.

ఆ తర్వాత హిరాణీ పూర్తిగా ఇత‌ర ప్రాజెక్టుల‌పైనే దృష్టి సారించారు కానీ మున్నాభాయ్ ప్ర‌స్థావ‌న తీసుకురాలేదు. ఎట్ట‌కేల‌కు మున్నా భాయ్ ఫ్రాంచైజీ మూడవ భాగం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, అధికారికంగా మొద‌లైన‌ట్టేన‌ని అర్షద్ వార్సీ తెలిపారు. స్క్రీన్‌తో తాజా ఇంట‌ర్వ్యూలో అర్ష‌ద్ దీనిని ధృవీక‌రించారు. సంజయ్ దత్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడిన అత‌డు.. మున్నా భాయ్ 3 ఇక ఆగ‌ద‌ని తేల్చేసారు. సంజూ అద్భుత‌మైన‌వాడు. పూర్తి భిన్న‌మైన ప్ర‌తిభావంతుడు. గతంలో అతడితో క‌లిసి ప‌ని చేయ‌డం చాలా సరదాగా ఉండేది. అయితే నేను సినిమా మొత్తం స్క్రిప్ట్ ని, భారీ కథాంశాన్ని గుర్తుంచుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌ను. కానీ సంజూ కార‌ణంగా క‌థంతా గుర్తుంచుకోవాల్సి వ‌చ్చేది అని వార్షీ అన్నారు. ఎందుకంటే ప్రతిరోజూ సెట్ లోకి వచ్చి ``బ్రదర్, ఈరోజు మనం ఏమి చేస్తున్నాము?`` అని అడిగేవాడు. ఆపై ఈ రోజు ఈ సన్నివేశం చేస్తున్నామని, నిన్న ఆ సన్నివేశం చేశామని, ముందున్న సన్నివేశం ఇదేన‌ని తర్వాత వచ్చే సన్నివేశంలో ఇది ఉందని నేను చెప్ప‌గ‌ల‌గాలి. ఇది క‌ష్ట‌మే కానీ ఒక అద్భుతమైన అనుభవం అని వివ‌రించారు.

పార్ట్ 3 ఇంత‌కుముందు మొద‌లు పెట్టినా కానీ, ఆశించిన విధంగా చేయ‌లేక‌పోయాం. కానీ ఇప్పుడు రాజు (రాజ్‌కుమార్ హిరానీ) దానిపై పని చేస్తున్నాడు. అతడు స్క్రిప్టుపై సీరియ‌స్ గా పని చేస్తున్నాడు.. ఇక ఆగ‌దు.. అది జరగాల్సిందేన‌ని అర్షద్ వార్సీ తెలిపారు.

మున్నాభాయ్ ఎంబిబిఎస్ 3 సెట్స్ పైకి వెళుతుంద‌ని ఇంత‌కుముందు ర‌చ‌యిత విధు వినోద్ చోప్రా కూడా ధృవీక‌రించారు. ఈ మూడో భాగం మొద‌టి రెండు భాగాల కంటే బెస్ట్ గా ఉండాలి. వందేళ్ల సినిమా కాలంలో ప్ర‌తిదీ వీటిలో చూపించాం. ఈసారి అంత‌కంటే ప్ర‌త్యేకంగా ఏదైనా చూపించాలి అని అన్నారు. మున్నాభాయ్ ఫ్రాంఛైజీ చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడు పార్ట్ 3 గురించి ఆస‌క్తిగా వేచి చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News