టీజర్: హీరోగా ఎంఎస్ ధోని అదిరిపోయే ఎంట్రీ
ఒకే ఒక్క టీజర్‌తో బిగ్ షాకిచ్చాడు ఎం.ఎస్.ధోని. క్రికెట్‌కి ముగింపు పలికిన తర్వాత అతడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది.;
ఒకే ఒక్క టీజర్‌తో బిగ్ షాకిచ్చాడు ఎం.ఎస్.ధోని. క్రికెట్‌కి ముగింపు పలికిన తర్వాత అతడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ఎంఎస్ ధోని తన భార్య సాక్షితో కలిసి సొంత బ్యానర్ స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేసాడు. అయితే అతడు హీరోగా ఆరంగేట్రం చేయడం గురించి ఎలాంటి లీకులు లేకపోవడంతో సడెన్‌గా టీజర్ విడుదల కాగానే బోలెడంత గందరగోళం నెలకొంది. అసలు ధోని ఏంటి? హీరో అవ్వడం ఏమిటి? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతడికి సినిమా పిచ్చి ఉన్న విషయం తెలుసు కానీ, నేరుగా హీరో అవుతాడని ఎవరూ ఊహించలేదు.
ఏదైతేనేమి.. ఇది అభిమానులకు ఊహించని వార్త. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ తో కలిసి కాప్ డ్రామా `ది ఛేజ్`లో నటిస్తున్నాడు. వాసన్ బాలా ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్‌లో ధోని ఎంట్రీ ఏ రేంజులో ఉంది? అంటే.. బ్యాడ్ బోయ్స్ ఫ్రాంఛైజీలో విల్ స్మిత్ కాప్ పాత్రలో ఎంట్రీ ఇచ్చినట్టు, ఇప్పుడు ధోని ఎంట్రీ ఇచ్చాడు. ధోనితో పాటు ఆర్.మాధవన్ కూడా ఈ టీజర్ లో సహ పోలీస్ పాత్రలో కనిపించాడు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ కాప్ డ్రామా, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం రక్తి కట్టించడం ఖాయమని అర్థమవుతోంది. ఇటీవల రోహిత్ శెట్టి సింగం సినిమాకి ఏ రేంజులో ఎలివేషన్ ఇచ్చాడో ఆ రేంజులో కాప్ పాత్రలకు ఎలివేషన్ ఇవ్వడం ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా కాప్ మిషన్‌లో ఎం.ఎస్.ధోని స్టైలిష్ అవతార్ ఊహించనిది. ఆర్.మాధవన్ అతడి కొలీగ్ పాత్రలో అంతే స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీనిని స్టైలిష్ కాప్ డ్రామాగా చెప్పవచ్చు. ఇందులో ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సాహసాలు, థ్రిల్స్ ఉంటాయని అర్థమవుతోంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లుగా ఇద్దరూ అద్భుతంగా కనిపిస్తున్నారు.
మాధవన్ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ``ఒక మిషన్. ఇద్దరు యోధులు. సిద్ధంగా ఉండండి, ఒక అద్భుతమైన ఛేజ్ ప్రారంభం కానుంది`` అని రాశారు. టీజర్ ఇన్ స్టంట్ గా బంపర్ హిట్టు. ధోని నటన ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం పెంచింది. అయితే ఇది వెబ్ సిరీసా లేక సినిమానా? కేవలం ఏదైనా బ్రాండ్ ప్రమోషనా? అన్నదానిపై సరైన స్పష్ఠత లేదు. అయితే దీనిని కేవలం ఒక అడ్వర్ టైజ్ మెంట్ అని చాలా మంది భావిస్తున్నారు. ఒకవేళ ఎం.ఎస్.ధోని ఏదైనా సినిమాలో నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా ఊహిస్తున్నారు. ధోని ఇటీవల గోట్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. గతంలో చాలా ప్రకటనల్లో కనిపించాడు. అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు హీరో అవుతున్నాడేమో! అయితే అన్నిటికీ తొందర్లోనే ధోని సమాధానం చెబుతాడేమో చూడాలి.