మోష‌న్ క్యాప్చుర్ టెక్నాల‌జీతో టాప్-5 సౌత్ డైరెక్ట‌ర్స్ ఆట‌

ఒకప్పుడు కేవ‌లం హాలీవుడ్ లో మాత్ర‌మే మోష‌న్ క్యాప్చుర్ టెక్నాల‌జీ అందుబాటులో ఉంది.;

Update: 2026-02-27 04:08 GMT

ఒకప్పుడు కేవ‌లం హాలీవుడ్ లో మాత్ర‌మే మోష‌న్ క్యాప్చుర్ టెక్నాల‌జీ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ప్ర‌పంచంలోని చాలా ప్రాంతీయ భాష‌ల ఫిలింమేక‌ర్స్ దీనిని స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకోవడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్యంగా భార‌త‌దేశంలో ఈ సాంకేతిక‌త‌తో ప‌ని చేస్తున్న ద‌ర్శ‌కుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం దీనిని ఉప‌యోగించారు. ప్ర‌స్తుతం `వారణాసి` సినిమా కోసం వాడుతున్న మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇటీవ‌ల‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో దేశంలోనే అత్యంత అధునాతనమైన ఏ అండ్ ఎం మోకాప్ లాబ్ (A&M MoCap Lab)ను జక్కన్న ప్రారంభించారు. అయితే ఈ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకోవాలంటే, దానిపై ముందే అవ‌గాహ‌న అవ‌స‌రం.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏమిటి?

ఇది నటుల కదలికలను ముఖ కవళికలను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి వాటిని డిజిటల్ క్యారెక్టర్లకు (CGI పాత్ర‌లు) అన్వయించే సాంకేతికత. ఉదాహ‌ర‌ణ‌కు జేమ్స్ కామెరూన్ `అవతార్` సినిమాలో నవి (Navi) పాత్రలు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో చింపాంజీలు ఈ టెక్నాలజీతోనే సృష్టించిన‌వే. రాజమౌళి `వారణాసి`లో మహేష్ బాబు చేసే కొన్ని అడ్వెంచర్ సీక్వెన్స్‌లను, ఇతర గ్రహాలకు లేదా పౌరాణిక పాత్ర‌లైన జంతు జీవ‌జాలాలకు సంబంధించిన సీన్లను ఈ ల్యాబ్‌లోనే మోష‌న్ క్యాప్చుర్ విధానంలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ఇత‌ర ద‌ర్శ‌కుల‌లో నాగ్ అశ్విన్, అట్లీ, ప్ర‌శాంత్ నీల్, వశిష్ఠ‌ కూడా మోష‌న్ క్యాప్చుర్ టెక్నాల‌జీని స‌ద్వినియోగం చేస్తున్నారు. కల్కి 2898 AD - సీక్వెల్ కోసం నాగ్ అశ్విన్ ఈ సాంకేతిక‌త‌ను విరివిగి ఉప‌యోగిస్తున్నారు. కల్కి మొదటి భాగంలోనే మోషన్ క్యాప్చర్ వాడారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పాత్రను యంగ్‌గా చూపించడానికి.. మరికొన్ని విజువల్స్ కోసం దీనిని ఉప‌యోగించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న `కల్కి 2` కోసం నాగ్ అశ్విన్ మరింత అధునాతన మో కాప్ (MoCap), అలాగే AR (ఆగ్యుమెంటెడ్ రియాలిటీ) టూల్స్ వాడుతున్నారు.

అల్లు అర్జున్ - అట్లీ (#AA22) కాంబో మూవీ ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ క‌థ‌తో రూపొందుతోంది. అల్లు అర్జున్ - అట్లీ ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని లోలా VFX, స్పెక్ట్ర‌ల్ మోష‌న్ వంటి స్టూడియోలను సందర్శించారు. ఇందులో డీ-ఏజింగ్ అంటే వయస్సు ను తగ్గించి చూపడం, కొన్ని వింత జీవుల సృష్టి కోసం మోషన్ క్యాప్చర్ వాడుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న `డ్రాగన్` సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్, మోషన్ క్యాప్చర్ పాత్ర కీలకం కానుంది. మెగాస్టార్ చిరంజీవి `విశ్వంభ‌ర` చిత్రం కోసం ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌ మోష‌న్ క్యాప్చుర్ టెక్నాల‌జీని ఉప‌యోగించార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. మోషన్ క్యాప్చర్ తో పాటు మరికొన్ని అత్యాధునిక సాంకేతికతలు `విశ్వంభ‌ర‌` విజువల్స్ కోసం వాడుతున్నారు. ఈ చిత్రంలో దాదాపు 4,800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఫాంటసీ ప్రపంచంలోని వింత జీవులు, పాత్రల కదలికలు సహజంగా ఉండటం కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉప‌యోగించార‌ని సమాచారం.

సౌత్‌లో ఇప్పటివరకు వచ్చిన మోషన్ క్యాప్చర్ సినిమాల వివ‌రాల్లోకి వెళితే...

తెలుగులో పూర్తి స్థాయి మోషన్ క్యాప్చర్ సినిమాలు తక్కువ ఉన్నా కానీ కీలక సన్నివేశాల్లో దీని వాడకం పెరిగింది. ఇంత‌కుముందు నానీతో ఈగ సినిమా కోసం దీనిని రాజ‌మౌళి ఉప‌యోగించారు. ఈగ క‌ద‌లిక‌ల్ని మోష‌న్ క్యాప్చుర్ సాంకేతిక‌త‌తోనే సృష్టించారు. ఈగ కదలికల కోసం రాజమౌళి అప్పట్లోనే బేసిక్ మోషన్ స్టడీస్ వాడారు. బాహుబలి1, బాహుబ‌లి 2 సినిమాల‌ యుద్ధ సన్నివేశాల్లో వేల సంఖ్యలో సైనికులను చూపించడానికి.. జంతువుల కదలికల కోసం వాడారు. కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ) పోరాట దృశ్యాలు, బుజ్జి (AI వాహనం) ఇంటరాక్షన్స్ కోసం మోషన్ క్యాప్చుర్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించారు. `వారణాసి`లో మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్లోబల్ అడ్వెంచర్ సీన్ల కోసం ఇప్పుడు రాజ‌మౌళి విరివిగా మోష‌న్ క్యాప్చుర్ విధానాన్ని ఉప‌యోగిస్తున్నారు.

అప్ప‌ట్లో కొచ్చాడయాన్ (విక్రమసింహ- తెలుగు) సినిమా కోసం మోష‌న్ క్యాప్చ‌ర్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగంచారు. ఇది భారతదేశపు మొదటి పూర్తి స్థాయి ఫోటోరియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ సినిమా. రజనీకాంత్ హీరోగా న‌టించారు. కానీ చెత్త విజువ‌ల్స్ తో సినిమా ఫెయిలైంది.

ఇటీవ‌ల రాజ‌మౌళి మాట్లాడుతూ..గతంలో బాహుబలి, ఈగ వంటి సినిమాల సమయంలో మన దేశంలో ఇలాంటి ల్యాబ్ ఉండి ఉంటే.. నేను ఆ సినిమాలను ఇంకా అద్భుతంగా తీసేవాడిని అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనే ఈ సాంకేతిక‌త అందుబాటులోకి రావ‌డంతో భ‌విష్య‌త్ లో తెలుగు సినిమా, సౌత్ సినిమా ఏ రేంజుకు వెళ్ల‌బోతోందో ఊహించుకోవ‌చ్చు.

Tags:    

Similar News