సవాళ్లకు సిద్ధమంటున్న సీనియర్ హీరోలు
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న మోహన్ లాల్, మమ్ముట్టికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న మోహన్ లాల్, మమ్ముట్టికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వారు గొప్ప నటులుగా ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్లు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు. అయినా ఇప్పటికీ ఈ సీనియర్ హీరోలిద్దరూ అవకాశం వచ్చిన ప్రతీసారీ తనలోని నటుల్ని ప్రూవ్ చేసుకుంటున్నారు.
మోహన్ లాల్ వయసు 65 సంవత్సరాలు, మమ్ముట్టి వయసు 73 ఏళ్లు. అయినప్పటికీ వీరిద్దరూ ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు సమానంగా సినిమాల్లో నటిస్తూ, కొత్త ప్రయోగాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ తిరుగులేని స్టార్లుగా గుర్తింపు అందుకుంటున్నారు. ఈ వయసులో వారు చేస్తున్న ప్రయోగాలను చూసి కొత్త తరం హీరోలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
రీసెంట్ గా మోహన్ లాల్ ఓ కమర్షియల్ యాడ్ లో జ్యుయలరీ పెట్టుకుని, ఆడవాళ్లు ఎలా అయితే హావభావాలు పలికిస్తారో అలానే కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచగా, రెండేళ్ల కిందట రిలీజైన ఓ సినిమాలో గే క్యారెక్టర్ లో కనిపించి మమ్ముట్టి కూడా అందరికీ షాకిచ్చారు. ఈ సీనియర్ హీరోలిద్దరూ ఎప్పటికప్పుడు రొటీన్ భిన్నంగా పాత్రలు చేస్తూ వస్తున్నారు.
రీసెంట్ గా మోహన్ లాల్ చేసిన జ్యుయలరీ యాడ్ చూస్తే ఎవరైనా షాకవక మానరు. ఎక్కడైనా జ్యుయలరీ యాడ్ ను ఎక్కువగా మోడల్‌తోనో లేదంటే హీరోయిన్‌తోనే చేయిస్తారు కానీ ఇక్కడ ఆ యాడ్ లో మోహన్ లాల్ కనిపించారు. జ్యుయలరీ షాప్ యాడ్స్ హీరోలు కూడా చేస్తున్నారు కానీ వాళ్లు కేవలం ఆయా ఆభరణాల గురించి, షాప్ గురించి చెప్తారు తప్పించి ఏ హీరో ఆ ఆభరణాలను ధరించి వాటి గురించి చెప్పరు. కానీ మోహన్ లాల్ మాత్రం దానికి భిన్నంగా మెడలో నెక్లెస్, చేతికి రింగ్ పెట్టుకుని, అచ్చు ఆడవాళ్లు ఎలా అయితే మురిసిపోతారో అలానే అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయారు. ఈ యాడ్ లో మోహన్ లాల్ యాక్టింగ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతూ అందుకే ఆయన్ని కంప్లీట్ స్టార్ అంటారని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు మమ్ముట్టి కూడా అలానే నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. కాదల్: ది కోర్ సినిమాలో గే పాత్రలో నటించి మెప్పించిన మమ్ముట్టి స్టార్ హీరో అయినప్పటికీ ఆ పాత్రలో నటించిన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆల్రెడీ వీరిద్దరూ కెరీర్లో ఎన్నో సాధించినప్పటికీ విభిన్న పాత్రలలతో నటనలో తమకు ఎవ్వరూ సాటి రారని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు.