వీడియో : నగలు వేసుకుని షాక్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌

భారత సాంప్రదాయంలో నగలు అనగానే ఆడవారు గుర్తుకు వస్తారు. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు నగలు ధరించే వారు అన్నట్లుగా సినిమాల్లో చూపించారు.;

Update: 2025-07-19 13:05 GMT

భారత సాంప్రదాయంలో నగలు అనగానే ఆడవారు గుర్తుకు వస్తారు. ఒకప్పుడు రాజులు, చక్రవర్తులు నగలు ధరించే వారు అన్నట్లుగా సినిమాల్లో చూపించారు. కానీ ప్రస్తుత సినిమాల్లోనూ హీరోలు నగలు ధరించడం చూపించరు. ఒకవేళ చూపించినా తేడాగా అనిపిస్తుంది. అయితే ఏదైనా వేడుకల్లో మగవారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన హారాలు ధరించడం మనం చూస్తూ ఉంటాం, కానీ బంగారు ఆభరణాలను ధరించడం మనం చూడం. ఒకవేళ ఎవరైనా ధరించిన కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. ఏ స్టార్‌ హీరో కూడా నగలు ధరించి నటించాలని అనుకోరు. ఒకవేళ నటించినా ఎలాంటి ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుందో వారికి బాగా తెలుసు, అందుకే స్టార్స్ అలాంటి ప్రయోగాల జోలికి వెళ్ళరు. కానీ సూపర్‌ స్టార్‌ నగలు ధరించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు.

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ తాజాగా ఒక ప్రముఖ జ్వెలరీ యాడ్‌లో నటించారు. ఎంతో మంది స్టార్స్‌ జ్వెలరీ యాడ్‌లో నటించారు. అమితాబ్ బచ్చన్‌ మొదలుకుని నాగార్జున వరకు ఎంతో మంది స్టార్స్‌ ఈ తరహా యాడ్స్‌ లో నటించారు. కానీ ఎవరూ కూడా నగలు ధరించి మాత్రం కనిపించలేదు. కానీ మోహన్‌ లాల్‌ తాజాగా చేసిన జ్వెలరీ యాడ్‌లో నగలు ధరించి కనిపించడం చర్చనీయాంశం అయింది. ప్రముఖ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ప్రకాశ్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నగలు ధరించిన సూపర్‌ స్టార్‌ ఆడవారు మురిసి పోయినట్లుగా మురిసి పోతూ చూసుకుంటున్నట్లుగా ఉన్న ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ను ఈ యాడ్‌లో స్టార్‌గానే చూపించారు. సినిమా సెట్‌ నుంచి తన కార్‌ వాన్‌ లోకి నగలను రహస్యంగా తీసుకు వెళ్లి ధరించి మిర్రర్‌లో చూసుకుంటున్న మోహన్‌ లాల్‌ను ఈ యాడ్‌లో చూడవచ్చు. నటుడు అన్నప్పుడు అన్ని తరహా పాత్రలు చేయాలి, అన్ని రకాలుగా చేయాల్సి ఉంటుంది. మోహన్‌ లాల్‌ వంటి సూపర్ స్టార్‌ ఇలాంటి తరహా యాక్ట్‌కి ఒప్పుకోవడం గొప్ప విషయం. మోహన్‌ లాల్‌ గతంలోనూ ఇలాంటి ప్రయోగాలను, షాకింగ్‌ యాక్ట్‌లను చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు మోహన్‌ లాల్‌ నగలు ధరించి మురిసి పోతున్నట్లుగా నటించడం వల్ల ఆయనకు పోయే పరువు ఏమీ లేదు. పైగా తాను డబ్బులు తీసుకున్న కంపెనీ కి మంచి పేరు వస్తుందని ఆయన భావించి ఉంటాడని విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ డబ్బు కోసం ఇంకా ఎంతకు దిగజారుతారు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి యాడ్స్‌లో నటించడం ద్వారా ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారు అంటూ విమర్శలు చేస్తున్న వారు కొందరు ఉన్నారు. అయితే సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఏం చేసినా నటుడిగా అందరిని అలరించేందుకు, తాను చేసే ప్రాజెక్ట్‌కు న్యాయం చేసే విధంగా చేస్తారని అంటున్నారు. ఇటీవల తుడరుమ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ వయసులోనూ ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ తన స్టార్‌డంను కొనసాగిస్తూ, యంగ్‌ హీరోలకు పోటీని ఇస్తున్నారు.

Tags:    

Similar News