అలా చేస్తే నేను బతికినా ఒకటే సచ్చినా ఒకటే
తాజాగా మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడాడు.;
మోహన్ బాబు. టాలీవుడ్ లో ఈయన పేరుకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. అతని అసలు పేరు భక్త వత్సల నాయుడు. ఇండస్ట్రీలోకి రాకముందు భక్తవత్సల నాయుడిగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసిన మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో కూడా వర్క్ చేశారు. 1975లో దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన స్వర్గం నరకం సినిమాతో నటుడిగా ఆయన కెరీర్ ను స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గొప్ప పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ తో పాటూ కూతురు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. వారి ముగ్గురినీ మోహన్ బాబు ఎంతో క్రమశిక్షణతో పెంచారు.
అయితే అప్పటివరకు క్రమశిక్షణ అంటే మోహన్ బాబు, మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అన్నట్టు ఉన్న వీరి ఫ్యామిలీ గత కొన్నాళ్లుగా వివాదాల్లో నిలిచి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అంటూ గొడవలు బయటకు రావడమే కాకుండా మోహన్ బాబు, మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కేలా చేశాయి ఆ గొడవలు.
అప్పటివరకు సొసైటీలో ఎంతో బాగా బతికి ఎంతో గౌరవ మర్యాదలతో ఉన్న మోహన్ బాబు పరువు మొత్తం ఈ గొడవలతో ఒక్కసారిగా పోయింది. ఇప్పటికీ ఆ వివాదాలు సమసిపోయింది లేదు. మంచు విష్ణు, మంచు మనోజ్ కుదిరినప్పుడల్లా మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం, ఇన్‌డైరెక్ట్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడి ఒకరినొకరు ఎటాక్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
తాజాగా మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడాడు. ప్రస్తుతం తన మైండ్ లో ఏమీ లేదని, తన ఫోకస్ మొత్తం తన తండ్రిని సంతోషంగా ఉంచాలనే దానిపైనే ఉందని, ఆయనెంతో కష్టపడి మమ్మల్ని ఈ స్థాయిలోకి తెచ్చారు. ఆయనకు మంచి పేరు తీసుకునిరాకపోయినా పర్లేదు కానీ చెడ్డపేరు మాత్రం తీసుకురాకూడదని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యానని, ఏ రోజైతే నా వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చిందో ఆ రోజు కొడుకుగా నేను బతికినా ఒకటే సచ్చినా ఒకటే అని చెప్పాడు. విష్ణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.