'పురుష:'.. వాయిస్ తో కీరవాణి మ్యాజిక్..
ఇటీవల వచ్చిన టీజర్ కూడా ఫుల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమా నుంచి థీమ్ సాంగ్ విడుదలై అందరినీ మెప్పిస్తోంది.;
'పురుష:'.. టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ మూవీ.. రిలీజ్ కు సిద్ధమవుతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తుండగా.. ఆ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దర్శకుడిగా వీరు ఉలవల వ్యవహరిస్తున్నారు..
ఇప్పటికే ఆయన మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేయగా.. ఇప్పుడు పురుష: మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ నటిస్తుండగా.. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ కూడా ఫుల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమా నుంచి థీమ్ సాంగ్ విడుదలై అందరినీ మెప్పిస్తోంది.
జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు మేకర్స్. భర్త-భార్యల మధ్య జరిగే మాటల తూటాలు, మనసులో దాచుకున్న బాధలు, మగవారి భావోద్వేగాలను సరదాగా, సున్నితంగా చూపించే ప్రయత్నం ఆ పాటలో కనిపిస్తుంది. ముఖ్యంగా సాంగ్ వినగానే నవ్వు తెప్పిస్తూనే.. అదే సమయంలో ఆలోచనలు కూడా రేకెత్తిస్తోంది.
అయితే ఆ పాటకు పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి స్వయంగా పాడడం ప్రత్యేక ఆకర్షణ. ఆయన గాత్రంలోని అనుభూతి, మృదుత్వం పాటకు కొత్త ప్రాణం పోశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మెయిన్ గా అటు వ్యంగ్యం, ఇటు భావోద్వేగం రెండింటినీ సమానంగా డీల్ చేస్తూ, వినేవారి మనసులో పాట ఎప్పటికీ నిలిచిపోయేలా కీరవాణి పాడారు.
సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ సింపుల్ గా కానీ హృద్యంగా ట్యూన్ అందించారు. లిరిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చేలా స్వరాలను రూపొందించారు. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ మరో హైలైట్ గా నిలిచాయి. భర్త-భార్యల మధ్య ఉండే అంచనాలు, అసంతృప్తులు, చిన్నచిన్న గొడవలను సరదాగా చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది. కథను ముందుకు తీసుకెళ్లేలా పాట సాగుతూనే, కీలక విషయాలు బయట పెట్టకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు సాంగ్ ఆకట్టుకుంటుండగా.. మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.